జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నా గుండె చప్పుడు..

 • ప్రచురించిన సమయం: 11:17:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

అందరి మధ్యన నేనున్నప్పుడు..
హఠాత్తుగా నువ్వు గుర్తొచ్చినప్పుడు..
మనుసూ మాటా మూగవోయినప్పుడు..
ఏమయిందని అందరు అడిగినప్పుడు..
ఏమి లేదని చెప్పలేక..
ఏమయిందో తెలుపులేక..
నేనుపడ్డ వేదన ఎవరితో పంచుకోను (ఒక్క నీతో తప్ప)?

Inspired by పడమటి కోయిల పల్లవి..

వెళ్ళిపోతున్నావా నేస్తం..

 • ప్రచురించిన సమయం: 5:35:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


కనురెప్పలు నీ జ్ఞాపకాల్ని మోయలేనంటూంటే..
కనుపాపలు నీ రూపాన్ని దాయలేనంటూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
వెచ్చగా విరిసిన కల చిక్కని కన్నీరు చిమ్ముతుంటే..
ఝుమ్మని ఎగిసిన అల దక్కని స్నేహాన్ని చూపుతుంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..

వెనక్కిరాని కాలం మదికందిన మధురానుభుతుల్ని మమేకం చేస్తూంటే..
వెక్కివచ్చే ఏడుపు హృదికందిన స్వరాగమాలికల్ని చిన్నాభిన్నం చేస్తూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
అనుభూతుల హారంలో చేరిన పుష్పాలు నను చూసి జాలిపడుతూంటే..
ఎదలోతుల దారంలో కూరిన రాగాలు నను చూసి శిలలై పోతూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..

నిదురించే తోటలో నే ఏరుకున్న ఊహల కుసుమాలు నను చూసి విలపిస్తూంటే..
దరిచేరిన పాటలో నే కూర్చుకొన్న ప్రభంధాలు విషాద రాగం ఆలపిస్తూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
చిరునగవు చాటున దాగిన మౌనం మనస్సును మెలిపెడుతూంటే..
అడుగుల మడుగులో దాగిన జంటపాదాలు నను ఓదారుస్తూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..

అమృతం కురిసినరాత్రి

 • ప్రచురించిన సమయం: 2:55:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

ఎన్ని సరదాల ఆగరొత్తులు వెలిగించు కొన్నాను !!
ఎంత కాంక్షా శ్రీగంధంబు మైనొలది కొన్నాను !!
ఇంకా రావెందుకు ప్రభూ??
ఈ రాత్రి శంకాకులమై సడలి పోతూ వుంది..
మల్లెలు నను చూసి పరిహసిస్తున్నాయి..

నా మది నీ వెచ్చని ఊహల తాలూకు మధుర ఉఛ్వాసలతో నిండి పోయింది..
ఈ గది నా నులి వెచ్చని వూపిరి తాలూకు సుమధుర నిఛ్వాసలతో నిండి పోయింది..
నా విశాల చక్షువులు నా మది తాలూకు గవాక్షాలై..
నీ రాక కోసం అనిమేషమై ఎదురు చుస్తూఉంటే..
ఇంకా రావెందుకు ప్రభూ??

నీరవ నిశీధి వేళలో నే కన్న స్వప్నాల తాలూకు పరిమళాలని నీతో పంచు కోవాలని
ఆశగా..
ఆర్తిగా..
నే ఎదురు చుస్తూఉంటే..
ఇంకా రావెందుకు ప్రభూ??

నిశబ్దంగా నా కంటి నుంచి జాలువారిన అశ్రుబిందువు..
శబ్దం చేస్తూ నేలపై జాలువారుతూ..
నీవు సామీప్యాన లేవన్న నగ్నసత్యాన్ని నాకు గుర్తు చేస్తూ..
మరో అశ్రుబిందువుకు మార్గాన్ని సుగమం చేస్తున్న వేళ కూడా..
ఇంకా రావెందుకు ప్రభూ??

- Inspired by Tilak's అమృతం కురిసిన రాత్రి.