జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నీకిది తెలుసా?

 • ప్రచురించిన సమయం: 8:45:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

నిరాశలో ఎన్ని వేడి నిట్టూర్పులు విడిచానో..
నా ఈ గది నాలుగు గోడలకే తెలుసు..
నీధ్యాసలో ఎన్ని రుధిరాశ్రువులు రాల్చానో..
నా ఈ తలపులు పంచుకొనే తలగడకే తెలుసు..

నీశ్వాసలో మునిగి ఎన్ని పరివేదనలు దాచుకున్నానో..
నా ఈ స్మృతి యవనికలకే తెలుసు..
నీఆశలో తేలి ఎన్ని విరహవేదనలు మిగుల్చుకున్నానో..
నా ఈ గతి పవనికలకే తెలుసు..

నీకోసం విరించినై ఎన్ని ప్రేమలేఖలు రాసానో..
వలపులు నింపుకొనే నా అక్షరాలకే తెలుసు..
నీకోసం విపంచినై ఎన్ని రాగాలు పలికించానో..
తలపులు వొంపుకొనే నా మది గవాక్షాలకే తెలుసు..

ఇవన్నీ నీకై నే రాసే వలపు కావ్యాలు..
ఇవన్నీ నీకై నే దాచే తలపు దృశ్యాలు..

- Inspired by anonymous......

వెళ్లిపోయావా నేస్తం?

 • ప్రచురించిన సమయం: 10:40:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..వెళ్ళిపోతున్నావా నేస్తం చదివారా? దీన్ని చదివే ముందు దాన్ని చదువగలరని మనవి.

నువు విహరించిన పూతోటలో..
నువు పహరించిన దారిలో..
నే ఏరుకున్న నీ నవ్వుల కుసుమాలన్నీ
నను ఓదారుస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నువు మెరిసిన జ్ఞాపకాల విపణిలో..
నువు కురిసిన కలల ధరణిపై..
నే పేర్చుకొన్న నీ చూపుల సిత్రాలన్నీ
నను నడిపిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నువు విరిసిన నా ఊహల పందిరిలో..
నువు విరచించిన నా ఊసుల మందిరిలో..
నే కూర్చుకున్న నీ నవ్వుల రువ్వులన్ని,
నను పరిహసిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నువు నేను కలిసి నడిచిన సాగరతీరంలో..
నీ పాదాలను ఆర్తిగా స్పృశించిన కెరటాలు..
సైతకసీమల్లో నే నిర్మించుకున్న నీ తలపుల శిల్పాలు..
ఆరాటంగా నా మది ఘోషను వినిపిస్తుంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

ప్రియమైన నీకు..

 • ప్రచురించిన సమయం: 3:11:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: లేఖలు..

ప్రియమైన నీకు,
ఎలా వున్నావు నేస్తం అంటూ మరుపురాని నీ జ్ఞాపకాలు నను మైమరపిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే ఏమని సమాధానమివ్వను నేస్తం? కుశలమా నేస్తం అంటూ ఊహలపల్లకిలో ఊయలూపేసిన ఊసులు నను ఆరాటంగా స్పృశిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే ఏమని చెప్పగలను నేస్తం? కనులు కనులు కలిసి చూపులతో జరిగిన రాయభారాలు, అన్నిటికీ మౌనమేల, మాట పెదవి దాటదేల, అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే దానికి మౌనమే సమాధానమైతే నేనేమని చెప్పగలను నేస్తం?

తొలిసంజె ఎరుపు నీ సిగ్గుల మోములోని ఎర్రదనాన్ని జ్ఞప్తికి తెస్తూంటే, ఉషోదయపు తుషార బిందువు నీ చూపులోని స్వచ్ఛతను గుర్తుకు తెస్తూంటే, కోయిల కలకూజితాలు నీ స్వరాన్ని దాటిన మధుర పలుకులను పలువరిస్తుంటే ఇలా ఉదయాన్నే నిద్రలేవడం చాలా బావుంది. నీరెండ చురుక్కు నీ చిరుకోపంలోని చమక్కుని కూడా చూపిస్తుంటే ఇంకా బావుంది. కాని ఈ క్షణం నీవు నా పక్కన లేవన్న నిజం నను కాస్సేపు భాధ పెట్టినా, ఇలా నీవు మిగిల్చి వెళ్ళిన ఏకాంతంలో నీవు నాకోసం భధ్రంగా దాచిన మధురోహలు నను పెనవేసుకుంటూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది సుమా.

నేనంతా నీ పలువరింతలతో, రేయంతా నీ కలువరింతలతో నిండినట్లు ఆకాశం అంతా పయోధరాలతో నిండినట్లుంది (అలా కోపంగా చూడకు. నిజ్జంగా నిజం, ఈ పయోధరాలు అన్న పదాన్ని కేవలం మబ్బులు అని చెప్పడానికే వాడాను) . చల్లగాలి అలా మెల్లగా నను స్పృశిస్తూ ఉంటే, పిల్ల తుమ్మెర అల్లన మెల్లన నా శ్రవణాల్లో గిలిగింతలు పెడుతూ ఉంటే, నేనిక్కడ నీకోసం మనస్సునంతా కన్నులు చేసుకొని ఎదురుచూస్తూ ఉంటే, నను ఈ ఒంటరితనపు కైవారంలో బంధిచడం నీకేమన్నా న్యాయమా?

అదిగో వర్షం, నేను నీకున్నా తోడు అంటూ రయ్యిన నా వైపే వచ్చేస్తూ ఉంది. ఇదిగో ఇక్కడ మట్టి వాసన కమ్మగా అచ్చం నీవు నాకోసం కలిపే కాఫీ వాసనలా కమ్మగా నా నాసికకు చేరుతూ ఉంది. నీకు ఈ కాఫీ పిచ్చి పోదా అని కోపంగా అలా చూడకు. ఎంతైనా నీ చేతులతో కలుపుతావు కదా అందుకనే అదంటే నాకు చచ్చేంత ఇష్టం కాదు కాదు చచ్చిపోవాలనిపించేంత ఇష్టం. కాని ఇప్పుడు నువ్వు లేవు కదా అందుకని నేనే కాఫీ కలుపుకొని తాగుతున్నాఇలా కాఫీ తాగుతూ, అలా చిరుజల్లులలో తడుస్తూ, మన పెరటిలోని పూదోటలో తడుస్తూ, నీవు నేను కలిసి పంచుకొన్న అనుభూతుల్ని నెమరు వేసుకుంటున్నా. ఈ పూదోటలోని చెట్లని చుస్తే నాక్కొంచెం అసూయగా ఉంటుంది, నీ ప్రేమని నాతో పాటు పంచుకొంటున్నాయని. అలా నవ్వకు, నాకు కోపం వస్తుంది. ఇదిగో నువ్వు నాటిన మల్లెతీగ చిన్న చిన్న మొగ్గలు పెడుతూ ఉంది. ఈ మల్లెతీగను ఇప్పుడు ప్రేమగా స్పృశిస్తూ ఉంటే నిను తాకిన అనుభూతి కలుగుతూ ఉంది సుమా.

ఇటు చూసినా, అటు చూసినా, ఎటు చూసినా నీ రూపం కనిపిస్తూనే ఉంది. విరహం ఇంత భాధా కరమైనదని యెవ్వరూ నాకెందుకు చెప్పలేదు? అటు, ఇటు ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్ని సరదాలు, ఎన్ని అనుభూతుల్ని మనం మరిచిపోతున్నాం? నాకంటూ ఇప్పుడు శక్తి వస్తే వెనువెంటనే నీ ఎదుట వాలి, నీ ఒడిలో తలవాల్చి పడుకోవాలనిఉంది. నా ఈ అనుభూతుల్ని లిఖిత సంపుటాలుగా మార్చి నీకు అంకితమివ్వాలనుంది. ఇదిగో ఇప్పుడే laptop లో నుంచి పాట వస్తుంది, "నువ్వు.. నువ్వు.." (ఖడ్గం లోది ఈ పాట అనుకుంటా. కదా?). అస్సలు ఇంత మంచి పాటలు ఎలా రాస్తారో కదా ఈ కవులు? మనస్సు మూలల్లోకి తొంగి చూసి, ఎదలోయల్లోని లయలను ఒడిసిపట్టి.

"ఎన్ని సరదాల ఆగరోత్తులు వెలిగించుకున్నాను..

ఎంత కాంక్షా శ్రీగంధంబు మైనొలది కొన్నాను..

ఇంకా రావెందుకు ప్రభూ.."
అంటూ తిలక్ విరహొత్కంఠిత అయ్యి నీ మనస్సుతో నా మనస్సును పెనవేసి నీ కోసం అభిసారికనై నా మది గవాక్షం దగ్గర, తడి కన్నులతో, నీ అడుగుల సవ్వడి కోసం అనిమేషమై ఎదురుచూస్తూ ఉంటాను త్వరగా వచ్చెయ్యి సుమా.

నేను మాత్రం

 • ప్రచురించిన సమయం: 5:17:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

శిలలు ధార ప్రవృత్తికి కరిగినా..
మరులు క్షార వృద్ధితికి క్షీణించినా..
విరులు క్షామ తీవ్రతకి కృశించినా..
నేను మాత్రం నీ వూహల వానలోనే తడుస్తూ వుంటా..

-Inspired By Anonymous poet.

నేను

 • ప్రచురించిన సమయం: 10:43:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


నాలో నేను..
నిత్యం భావ ఝరంపరిలో తడిసి ముద్దై పోతూఉంటాను..
అనునిత్యం అనురాగ శరంపరిలో ఆలంబన పొందుతూఉంటాను..
ఆద్యంతం సంఘర్షణ ఒడిలో స్వాలంబన పొందుతూఉంటాను..

నాతో నేను..
అంతం లేని ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతూ ఉంటాను..
సొంతం కాని కలల ప్రాకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాను..
పొంతన కుదరని వాస్తవాల కడలిని ఈదుతూ ఉంటాను..

నాకై నేను..
ఊహల పందిరి వేసే అనుభూతుల్ని నెమరు వేసుకొంటూ ఉంటాను..
ఊసుల రంగవల్లులు వేసే స్వప్నాలని పరికిస్తూ ఉంటాను..
ఉరికే మది తాలూకు రసానుభూతులలో ఓలలాడుతూ ఉంటాను..

ఏకాంతంలో..

 • ప్రచురించిన సమయం: 9:11:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

నువ్వు మిగిల్చిన ఏకాంతంలో, నీవు పేర్చిన జ్ఞాపకాల
అరలని శోధిస్తున్నా.. అక్కడైనా నీ సన్నిధి దొరుకుతుందేమోనని..
నువ్వు విదిల్చిన ఒంటరితనంలో, నీవు మరచిన ఊసుల
దొంతరలని చేధిస్తున్నా.. అక్కడైనా నీ ఊహల నిధి చేజిక్కుతుందేమోనని..

నీవు మిగిల్చిన నిశ్శబ్ధపు నీరవంలో, నీవు విహరించిన కలల కైమోడ్పులైన
చక్షువులని తెరవలేకున్నా.. ఎక్కడ నీ రూపం మాయమవుతుందేమోనని..
నీవు విదిల్చిన అశ్రు తిమిరంలో, నీకై ఎగసిన అలలకై అరమోడ్పులయిన
గవాక్షాలని మూయలేకున్నా.. ఎన్నడైనా నీ అడుగు నా ఎదలోకి ప్రవేశితమౌతుందేమోనని..

అందమైన బాల్యం..

 • ప్రచురించిన సమయం: 1:04:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


అందమైన బాల్యం..
అమ్మ ఒడిలో వికసించి..
అనుభూతుల రెక్కలు తొడిగి..
ఊహాలోకంలో విహరించాల్సిన అందమైన బాల్యం..
పేదరికపు ఒడ్డున రెక్కలు తెగి..
రేపటి ఆశలేని బ్రతుకు ముక్కలు అయి..
రుధిర సంద్రంలో కష్టాల నావ నెక్కి..
అలుపెరగని పోరాటం చేస్తోందీ అందమైన బాల్యం..

అందమైన బాల్యం..
అల్లరి చూపులతో ముద్దు తెప్పించాల్సిన..
చిలిపి చేష్టలతో నవ్వుతెప్పించాల్సిన..
ముద్దు మాటలతో మురిపించాల్సిన అందమైన బాల్యం..
బేల చూపులతో నన్నాదుకోరు అంటూ..
బరువెక్కిన మట్టితట్టలు నే మోయలేనంటూ..
జానెడు పొట్టకోసం అవిశ్రాంతపు శ్రమ జరుపుతుందీ అందమైన బాల్యం..

నీకిది న్యాయమా?

 • ప్రచురించిన సమయం: 5:55:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


మనస్సునంతా అలమెల్లనై కదిలించి..
తనువునంతా తటిల్లతై కరిగించి..
రూపంతా విద్యుల్లతై తాకి..
చూపంతా శరాఘాతమై సోకి..
లోకమంతా శూన్యమై వినిపించి..
దిక్కులన్నీ ఏకమై కనిపించి..
చుక్కలన్నీ నవ్వులై వికసించి..
మరులన్నీ కురులై మరిపించి..
ఊపిరులన్నీ విరులై మురిపించి..
ధ్యాసలన్నీ నా శ్వాసలై ఉరిపించి..
నన్నేడిపించుట న్యాయమా?

నీ కోసం నేను..

 • ప్రచురించిన సమయం: 10:23:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

అగాధాల తలుపుల్ని తెరిచి, మనస్సు మూలల్లో చేజారిన
స్వప్నంకోసం వెతుకుతున్నా..
అశ్రుకెరటాల ఘోషని మరిచి, మది మందిరంలో నిలిపిన
నీ రూపం తలుస్తూ బ్రతుకుతున్నా..
శిశిర వర్ణాల విరహల్ని మరిచి, ఎదలోతుల్లో గూడుకట్టిన
విరజాజుల తలంపుల కోసం శోధిస్తున్నా..
నీవు మిగిల్చిన జ్ఞాపకాలన్నింటిని బంధించి, హృదిలోయల్లో విరిసిన
నిశ్శబ్దపు తపనల కోసం తపిస్తున్నా..
నువ్వులేని క్షణాలన్నింటిని నిషేధించి, అనుభూతుల్లో చేజారిన
ప్రతిక్షణపు తలపుల కోసం పరితపిస్తున్నా..
కనుపాపల మనవిని మన్నించి, రెప్పల మాటున దాగిన
నీ చిత్తరువు పలికే నిశ్శబ్దరాగం వింటున్నా..
విశ్వమంత చోటులో ఇమడలేక, నీ పక్కన మిగిలిన
చిరు స్థలం కోసం దాటలేని సప్తసముద్రాలని దాటుతున్నా..

అశ్రు విలాపం..

 • ప్రచురించిన సమయం: 4:45:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


నేస్తమా..
ఇన్నాళ్ళు నీ గుండెలో గూడు కట్టుకొని ఉండిపోయాను..
నీ వేదననంతా పంచుకొన్నాను..
నీ నివేదననంతా ఆలకించాను..
నీ స్వాతిశయాన్నంతా తిలకించాను..
నీ అభిసంశయాన్నంతా విన్నవించాను..
నీ ఆలోచనలన్నింటిని అర్ధం చేసుకున్నాను..
నీ ఊహలన్నింటిలో చేరి నీతో పాటు విహరించాను..
నీ జ్ఞాపకాలన్నింటిలో చేరి నీతో పాటు పహరించాను..
కాని ఈరోజు నేను..
నీ వేదనను భరించలేక నీ కనుకోనకుల్లోంచి జాలువారి..
నీ చెక్కిలిపై నుంచి ప్రయాణించి నెమ్మదిగా అదృశ్యం అయిపోతాను..
నేస్తం..
నా నిగమం నీ వేదనను కొంచమైనా తగ్గించగలుగుతుందని ఆశిస్తూ..
సెలవా మరి..

- Inspired by Yandamoori.

మనవి..

 • ప్రచురించిన సమయం: 3:28:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


కనుకొనల చివర నిలిచిన అశ్రుబిందువునడుగు..
నీకై నే రాల్చిన రుధిరాశ్రువులెన్నో చెబుతుంది.
కంటిపాపలలో నిలిచిన చిత్తరువునడుగు..
నీకై నే గీసిన వర్ణచిత్రాలెన్నో చెబుతుంది..
పెదవి చివర నిలిచిన మాటరాని మౌనాన్నడుగు..
నీకై నే దాచిన అరుణ పదనిసలెన్నో చెబుతుంది..
స్మృతి పరదాల చాటున నిలిచిన జ్ఞాపకాలనడుగు..
నీకై నే విరచించిన అభినవ శార్దూలాలెన్నో చెబుతుంది..
విరిసిన తలపులు పంచుకొనే నా తలగడనడుగు..
నీకై నే కన్న స్వప్నాల సంగతులెన్నో చెబుతుంది..
మెరిసిన వలపులు పంచుకొనే నా ఎదనడుగు..
నీకై నే పడ్డ వేదనల రూపులేఖలెన్నో చెబుతుంది..
అశగా ఎదురు చూసే నా మది గవాక్షాలని అడుగు..
నీకై నే ఎదురుచూసిన ఘడియలెన్నో చెబుతుంది..
ఊహల రహదారిపై తడబడుతున్న నా పాదాలనడుగు..
నీకై నే పయనించిన దూరాలెన్నో చెబుతుంది..
సాగర తీరంలో ఆర్తిగా నా పాదాలని స్పృశించే కెరటాలనడుగు..
నీకై నే పడే ఆరాటాల బాసలెన్నో చెబుతుంది..