జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అతడొక సైన్యం..

  • ప్రచురించిన సమయం: 10:48:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..



అతడొక సైన్యం..
ఎదను మండించిన ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
కుతకుతలాడే రుధిరపు ఆవేశాన్ని కరవాలంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కారే కన్నీటి చుక్కలని తుపాకీ గుండ్లలా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
దూరే పిరికితనాన్ని నిర్జించి, ధైర్యాన్ని ధరించి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కూలే బ్రతుకులు, కాలే కడుపులు, రగల్చిన మంటని మోస్తూ కదులుతున్నాడు కదనరంగానికి..
అవినీతి సెగలూ, అసమర్ధపు చేతలూ, మిగిల్చిన బ్రతుకును మార్చడానికి కదులుతున్నాడు కదనరంగానికి..


అతడొక సైన్యం..
భావావేశపు సున్నితత్వం, కవుల కలాలు, తమ తలరాతను మార్చలేవని తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..
తమ తరపున గొంతెత్తిన గళాలు మధ్యలోనే ఎందుకు మూగపోయాయే తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
తమకు రావలసిన, తనకు కావలసిన పిడికెడు మెతుకుల కోసం కదులుతున్నాడు కదనరంగానికి..
తమ వారికోసం, తన వారికోసం కావాల్సిన దోసెడు గంజికోసం కదులుతున్నాడు కదనరంగానికి..

అతన్నెవరు ఆపలేరు..
బక్క శరీరంపై నాట్యం చేసే లాఠీలు..
తెగిన నరాలపై విహారం చేసే గాయాలు..
శుష్కించిన దేహంలోకి దూసుకెళ్ళే తూటాలు..
కుటిల యుక్తులు, మారణకాండలు,
దమననీతులు, ఏమార్చే మాటలు..
ఇవేవీ అతన్ని ఆపలేవు, ఎందుకంటే ఇప్పుడు అతనొక సైన్యం..

Followers

తియ్యందనాల తెలుగు.. -