జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అతడొక సైన్యం..

  • ప్రచురించిన సమయం: 10:48:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..



అతడొక సైన్యం..
ఎదను మండించిన ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
కుతకుతలాడే రుధిరపు ఆవేశాన్ని కరవాలంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కారే కన్నీటి చుక్కలని తుపాకీ గుండ్లలా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
దూరే పిరికితనాన్ని నిర్జించి, ధైర్యాన్ని ధరించి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కూలే బ్రతుకులు, కాలే కడుపులు, రగల్చిన మంటని మోస్తూ కదులుతున్నాడు కదనరంగానికి..
అవినీతి సెగలూ, అసమర్ధపు చేతలూ, మిగిల్చిన బ్రతుకును మార్చడానికి కదులుతున్నాడు కదనరంగానికి..


అతడొక సైన్యం..
భావావేశపు సున్నితత్వం, కవుల కలాలు, తమ తలరాతను మార్చలేవని తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..
తమ తరపున గొంతెత్తిన గళాలు మధ్యలోనే ఎందుకు మూగపోయాయే తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
తమకు రావలసిన, తనకు కావలసిన పిడికెడు మెతుకుల కోసం కదులుతున్నాడు కదనరంగానికి..
తమ వారికోసం, తన వారికోసం కావాల్సిన దోసెడు గంజికోసం కదులుతున్నాడు కదనరంగానికి..

అతన్నెవరు ఆపలేరు..
బక్క శరీరంపై నాట్యం చేసే లాఠీలు..
తెగిన నరాలపై విహారం చేసే గాయాలు..
శుష్కించిన దేహంలోకి దూసుకెళ్ళే తూటాలు..
కుటిల యుక్తులు, మారణకాండలు,
దమననీతులు, ఏమార్చే మాటలు..
ఇవేవీ అతన్ని ఆపలేవు, ఎందుకంటే ఇప్పుడు అతనొక సైన్యం..

ఎలా తెలుపను??

  • ప్రచురించిన సమయం: 12:48:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


కంటున్నావా..???
నావి కాని కలలు కంటున్న నా నయనాల మాటున ఆగిన స్వప్నాలని...
వింటున్నావా..??
నాది కాని మౌనాన్నిఆశ్రయిస్తున్న నా అధరాల చాటున దాగిన మౌనాన్ని..

కనిపిస్తున్నదా..??
నాది కాని నివేదనను నివేదించలేక శిలై పోయిన నా ఎద తాలూకు మరణవేదన..
వినిపిస్తున్నదా..??
నావి కాని వేదనలను అందించలేక అలై పోయిన నా మది తాలూకు అరణ్యరోదన..

ఏదో తెలియని వేదన..
మది తాలుకు జ్ఞాపకాలని పట్టి కుదుపుతూ వుంటే..
ఏదో తెలియని యాతన..
ఎద తాలుకు గవాక్షాలని తీసి కరిగిన క్షణాలని చూపుతూ వుంటే..
నీకెలా వీడ్కోలు పలకను నేస్తం..???

ఎన్ని.. ఎన్నెన్ని..

  • ప్రచురించిన సమయం: 5:51:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ఊహల ప్రయాణం ఊపిరి వున్నంత వరకే..
ఊసుల నిరీక్షణం ఊహలున్నంత వరకే..

ఎన్ని చూపులు??
ఎన్ని మాటలు??
కాలం కరిగిపోతుంది, స్వప్నం ఇక చాలు అని కంటిపాప చెబుతుందా?
మది మీటుతున్న భావసరిగమల్ని ఆపమని ఎద చెబుతుందా?

ఎన్ని కలలు??
ఎన్ని అలలు??
సరాగాల అంచులకు.. సుస్వరాల మాలికల్ని చేర్చకు అని రాగమాలిక చెబుతుందా??
హారాల రాగ ప్రభంధాలకు.. మనోహరాల ఆల్లికలని పేర్చకు అని హాలిక చెబుతుందా??

ఎన్ని సరదాలు??
ఎన్ని జ్ఞాపకాలు??
రెప్పల మాటున తన రూపుని దాచకు అని నయనానికి కంటిపాప అడ్డొస్తుందా??
ఊహల చాటున తనని బంధించకు అని మదిలోని రూపు మాసిపోమ్మంటుందా??

ఎన్ని ఊహలు??
ఎన్ని నిట్టూర్పులు??
పెదవి మాటున దాగిన మౌనాన్ని చేధించమని నిశ్శబ్దం అడుగుతుందా??
నాసిక మరవని శ్వాసని తనపైని ఆశ మరచిపోమ్మని కోరుతుందా??

ఎన్ని విరహాలు??
ఎన్ని వియోగాలు??

-----------------------------**********************************-------------------------
(ఇది నేను 9 సం" క్రితం రాసింది. అందుకే కొంత (పూర్తిగానో ?) గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పెద్దలు క్షమించి ముందుకు సాగగలరని నావినతి.)

మీకేం తెలుసు??

  • ప్రచురించిన సమయం: 11:21:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


కల చెదిరినా కన్నీరు రాదేం??
మిన్ను విరిగినా మది చెదరదేం??
ఆశల సౌధం క్రుంగినా ఎద విరగదేం??

మదిలో బాధాసుడిగుండాల హోరు..
ఊహల రెక్కలకు సంకెళ్ళు వేశారు..
ఆశల హరివిల్లును కూల్చేసారు..
భవిష్యత్తును కాలరాసారు..
కలల మ్రొగ్గలను చిదిమేసారు..

మీకేం తెలుసు??
ప్రాతఃకాలపు హిమబిందువు లాంటి మా ఆశల వర్ణాలు..
మీకేం తెలుసు??
మనో ప్రాంగణాన మేము పెంచుకొన్న వూహల మ్రొక్కలు..
మీకేం తెలుసు??
కుల మతాతీతపు అవ్యక్త భావనల తియ్యందనాలు..
******************************************************************************************
నిజంగా నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా రాసాను. కుల, మతాలకి అతీతంగా వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక్కడ నిజజీవితానికి విరుద్ధంగా ఏమీ జరగలేదు. అమ్మాయికి ఇష్టంలేకుండా పెళ్లి చేసారు, అలానే అబ్బాయికి కూడా. కానీ వేరొకరితో జీవితం పంచుకోలేని ఆ అమ్మాయి విడాకులు తీసుకుంది. ఇది తెలిసిన మా వాడి భార్య వాడిని రోజూ సాధించుకు తింటోంది. పెద్దల మూర్ఖపు పంతాలకి పిల్లల జీవితాలు ఎలా చేజారిపోతాయో చెప్పేదానికి ఇదొక చిన్న ఉదాహరణ.
*******************************************************************************************

నీవు

  • ప్రచురించిన సమయం: 3:38:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ప్రతి దృశ్యం లోనూ..
అదృశ్యం గానూ..
నయనానందకరంగా నీవు..

ప్రతి శబ్దం వెనుకా..
సదృశ్యం గానూ..
తప్తశిలలా నేను...

కంటికెరుపులా..
వంటి మెరుపులా..
కైపెక్కిన కన్నుల నిండుగా నీవు..

తొలిసంజె ఎరుపులా..
వెన్నెల మెరుపులా..
మెరుపెక్కిన మిన్నుల నిండుగా నేను..

పెదవి మధ్యన..
మౌనం చాటున..
సిగ్గు తెరల వెనుక నీవు..

అల్లరి నవ్వుల మాటున..
అవ్యక్తపు విరహం పైన..
ఆలోచనల తీరాల ముందుర నేను..

చూస్తారా?

  • ప్రచురించిన సమయం: 8:28:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


(నేనీమధ్య రోడ్డు మీద వెళుతుంటే, అందరూ రోడ్డులో కొంత గ్యాప్ ఇచ్చి, కొంత పక్కగా వెళ్తున్నారు. ఏమయిందా అని చుస్తే, ఒక ముసలి ఆవిడ, పాపం రోడ్డు దాటలేక, నది రోడ్డు మీదే పాక్కుంటూ, రోడ్డు అవతలి వైపుకి వెళ్తూ ఉంది. అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆవిడ ఎంత అపాయంలో ఉందో పట్టించుకోవడంలేదు. నానాటికీ మనుష్యులలో మృగ్యం అయిపోతున్న మానవత్వానికి ఆనాటి సంఘటన నాకొక సాక్షంగా కనిపించింది, అనిపించింది. ఆ సంఘటనే నన్ను ఈ కవిత రాయడానికి ప్రేరేపించింది.)

ఇదిగో చూసారా ఈమెని?
ఎండిన గాజు కనుల్లోని దైనత్యం మీకు కనిపిస్తోందా?
మనస్సులోని మూగ రోదన మీకు వినిపిస్తోందా?
ఇదిగో చూస్తారా ఈమె,
శుష్కించిన శరీరంపై ఆగిన గురుతులు మీకు కనిపిస్తున్నవా?
జీవం చావని ఎదలో దాగిన ఆశాచారికలు మీకు అగుపిస్తున్నవా?
ఇదిగో చూసారా ఈమెని?
ఎముకులగూడైన కాయంపై కరిగిన జీవితపు అవశేషాలు..
ఇంకా కడుపుతీపిపై మిగిలిన ప్రేమ తాలూకు సశేషాలు..
ఇదిగో చూస్తారా ఈమె జీవితచిత్రాన్ని?
వేలుపట్టుకొని నడక నేర్పించిన మాతృమూర్తి ఈనాడు నడవలేక,
కదిలే జనసముద్రాన్ని దాటలేక, దాటించే దయామయహస్తం కోసం ఎదురుచూస్తూఉంది.
ప్రేమనంతా కూరి నోటిముద్దగా అందించిన అమృతమూర్తి ఈనాడు ఆకలికేక
తో, పిడికెడు అన్నంకోసం అడుక్కోలేక, ఆకలితీర్చే ఆపన్నహస్తం కోసం ఎదురుచుస్తూఉంది.

జాడలు

  • ప్రచురించిన సమయం: 5:40:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


నా కన్నుల మాటున దాగిన బాసలు..
నా పెదవుల చాటున చిక్కిన ఊసులు..
నా ఎద సడిలో ఇంకా పురివిప్పని ఊహలు..
నా అంతరంగమధనపు కన్నీటి కలలు..
నా మది నడిసంద్రపు జ్ఞాపకాల అలలు..
నా హృదయ అంతర్వాహినిని తాకే తప్త శిలలు..
నాలో మమేకమై, జీవితాంతం నిలిచే నీ జ్ఞాపకాలు..
నా మనోవ్యధను తీర్చే మలయమారుతపు వీచికలు..
నా గుండె గుప్పిట దాగిన విరహాగ్నిని దాచే కనీనికలు..
నా స్వాప్నికజగత్తులో నాతొ విహరించే నా అభిసారికలు…

అన్నీ నీవే.. అంతా నీ తావే.. అనంతానా నీ జాడే..

దగ్ధగీతం..

  • ప్రచురించిన సమయం: 5:07:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


వింటారా..??
వినీలాకాశంలో తారకలు తలుక్కున అందిస్తున్న..
మేఘలోకంలో మెరుపులు తటిల్లున నినదిస్తున్న..
దగ్ధగీతం..

వింటారా..??
గడ్డిపూలపై నిలిచిన తుషారబిందువుల చారకలు చూపిస్తున్న..
ధరిత్రీతలంపై మొలచిన గడ్డిపరకల మరకలు కురిపిస్తున్న..
దగ్ధగీతం..

వింటారా..??
చీకటిలో వెలుగు పంచుతూ తను కరిగిపోయే కొవ్వొత్తి రాసే..
రెక్కలొచ్చిన పక్షి గూడు వదిలితే కన్నతల్లి పడే తపన మోసే..
దగ్ధగీతం..

వింటారా..??
కొమ్మన కొమ్మన నిలబడలేక కోయిల విలపిస్తున్న..
రెమ్మన రెమ్మనుంచి రాలిపోయే పుష్పాలు ఆలపిస్తున్న..
దగ్ధగీతం..

చూస్తారా ఎదలో నే రాసుకుంటున్న దగ్ధగీతం..
వింటారా మదిలో నే పాడుకొంటున్న దగ్ధగీతం..

నీకెలా తెలుపను?

  • ప్రచురించిన సమయం: 11:08:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నిశ్శబ్ధ నీరవ నిశీధిలో,
చిరుదివ్వెపు వెలుగువై కనిపిస్తావని..

పున్నమి వెన్నెల తరంగాలలో,
వెల్లువలా వెలువెత్తుతావని..

వసంత మలయమారుతంలో,
మరుమల్లియలా మురిపిస్తావని..

చల్లని సంధ్యా సమయంలో,
సంగీతంలా వినిపిస్తావని..

అల్లన మెల్లన పిల్లగాలులలో,
ఊహాల ఊయలవై ఊపేస్తావని..

పరిమళించు సుమ సుగంధాలలో,
విరిసిన నీ ఊసులు పంపిస్తావని..
ఇలా..
నీకై వేయికన్నులతో వేచియున్నానని,
నీ కెలా చెప్పను??

కానరాని నీ కోసం ఎక్కడని వెతుకను??
ఎవ్వరిని అడుగను??

నా మది లో నిండిన రూపానివి నీవని..
నా ఎదలో విరిసిన ఊహాకుసుమం నీవని..
నీకెలా తెలుపను??

నా కళ్లు..

  • ప్రచురించిన సమయం: 2:32:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కలలు మానిన నా కళ్లు.. 

నీపై ఆరాధనకు నకళ్ళు.. 

తలపుల తావిలో తడిచిన నా కళ్లు.. 
నీపై సరాగాల తొలకరి జల్లు.. 

వుహాల పెన్నిధిలో వూయలూగిన నా కళ్లు.. 
నీపై అనురాగపు పూజల్లు.. 
 
కనీనికలో నీ చిత్తురువుని దాచిన నా కళ్లు.. 
అనంతపు అందాల హరివిల్లు.. 

క్షణమైనా మూయని నా కళ్లు.. 
నీపై నిలిచిన చూపులకు సంకెళ్ళు.. 
 
నిశ్శబ్దపు నీరాజనాల నా కళ్లు.. 
నీపై ముసిరిన వలపులకు వాకిళ్ళు.. 

Note: కలలో.. కన్నీటి అలలో.. బ్లాగులో కల వాడిన కనీనిక అన్న పదం నాకు తెగ నచ్చి దానిని ఈ టపాలో వాడేసాను. కృతజ్ఞతలు to కల.

గుర్తున్నవా??

  • ప్రచురించిన సమయం: 5:44:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ఆగని కాలం వెంబడి పరుగులు తీస్తూ..
ఎగిసే అలల పైబడి అందనంత ఎత్తుకు ఎగుస్తూ..
కరిగే కలల కోసం వెంబర్లాడుతూ..
నే తీసే పరుగులు నీకు గుర్తున్నవా??

ఊహా సౌధాల వెంబడి ఉరుకులు పెడుతూ..
గడచిన గతాల కోసం ఎదను త్రవ్వుతూ..
నీ సన్నిధిలో ఆగిన క్షణాలను అందుకొంటూ..
నే వేసే అడుగులు నీకు గుర్తున్నవా??

నీ నీడను అనుగమిస్తూ..
నీ జాడను అనుసరిస్తూ..
నీ శ్వాసను తీసుకుంటూ..
నీ ధ్యాసను మోసుకుంటూ..
నే రాల్చే కన్నీటి మడుగులు నీకు గుర్తున్నవా?

అన్వేషణ

  • ప్రచురించిన సమయం: 5:16:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ఆలోచనల అనంత సాగర గర్భాన నిలుచుంటావు..
సులోచనల రెప్పల మాటున సిత్రమై దాగుండిపోతావు..
అంతులేని ఊహల మేఘమాలికలలో పవళించిపోతావు..
పొంతన లేని కలలా కడలి కెరటమై నను ముంచెత్తుతావు..
సైతకసీమల్లో శిలలా నిలిచి నను మైమరచుతావు..
ప్రతిరోజూ నిన్నటి కలలా మిగిలి నను ఏకాంతంలో నిలిపేస్తావు..
నేడు రేపయ్యేలోగానే నను ఊహల్లో నిలిపి, నిన్నటి స్వప్నంలా మిగిలిపోతావు..

మొన్నటి జ్ఞాపకంలా నను చేరి..
నిన్నటి కలలా నేటి ఊసుల్లోకి మారి..
నేటి తలపులా ఎదలోకి జారి..
రేపటి ఊహలా కంటిపాపలోకి దూరి..
నిత్యం నను మాయచేసి నా మది పరదా చాటున నీలినీడలా పరుండిపోతావు..

మరచిపోయావా?

  • ప్రచురించిన సమయం: 3:46:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


మరచిపోయావా?
నువ్వు నేను కలిసి పంచుకొన్న ఊహలు..
మనస్సూ మనస్సూ కలిపి విరచించుకొన్న ఊసులు..

వాడిపోయాయా?
నాకై నువు రువ్విన ఓరచూపుల కంటికొనల ధృక్కులు..
నాకై నువు రాల్చిన మంత్ర ముగ్ధపు మనోహర వాక్కులు..

చెరిగిపోయాయా?
నువ్వు నేను మెలిసి నడిచిన దారిలో విరిసిన పాదముద్రలు..
నువ్వు నేను రాసి మది అంతరంగపు పుటల్లో దాచుకున్న కవితలు..

కరిగిపోయాయా?
నీకై నేను పంపిన వలపు మేఘసందేశాల ఆనందవీచికలు..
నీకై నేను వొంపిన తలపు తనూ వైభవపు విరీచికలు..

తరిగిపోయాయా?
చేయి చేయి కలిపి వెన్నెల రాత్రుల్లో మనం ఆలపించిన మంజీరనాదాలు..
ధ్యాస శ్వాస కలగలిపి పున్నమి కాంతుల్లో మనం తిలకించిన సాగరకెరటాలు..

మరచిపోయావా?
మన్ను మిన్ను కలిసినట్లున్నా అవి ఎప్పటికీ కలవవన్న నిజం..
కన్ను కన్ను పక్కనే ఉన్నా అవి ఎప్పటికీ చూసుకోలేవన్న నిజం..

ఎంకి..

  • ప్రచురించిన సమయం: 2:36:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

పృథ్వీ గారు గీసిన ఒక అద్భుతమైన కళాఖండానికి నా స్పందన..

కడవనెట్టుకొన్న రాయంచ చెరువుగట్టు మీద నడచుచుండ..
రెప్పదాటుకొన్న చూపు పడతి చనుకట్టు మీద పడుచుండ..
పిక్కదాటుకొన్న అతివ చీరకట్టు మదిన మరీచికలు వీచుచుండ..
మనస్సు దోచుకున్న మగువ కనికట్టు ఎద చప్పుడు దోచుచుండ..

అలమెల్లన కదిలే రమణి కృష్ణవేణి జంటసర్పాలేమో అనిపించుచుండ..
వాలుకళ్ళలో మెదిలే తొయ్యలి భావమోహనం రాగ వీచికలు ఆలపించుచుండ..
పల్లెలో విరిసిన మానిని ముగ్ద మోహన సౌందర్యం ఎంకిని తలపించుచుండ..
సుదతి ముఖారవిందం చూసి పద్మమేమో అని భ్రమరం భ్రమించుచుండ..

లలన ఆలన మెల్లన వయ్యారియై, భీతన హరిణేక్షియై..
చెరువు గట్టు దాటి, పుట్ట దాటి పల్లెవైపు సాగిపోయింది.

ఫృధ్వి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..

నీకిది తెలుసా?

  • ప్రచురించిన సమయం: 8:45:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నిరాశలో ఎన్ని వేడి నిట్టూర్పులు విడిచానో..
నా ఈ గది నాలుగు గోడలకే తెలుసు..
నీధ్యాసలో ఎన్ని రుధిరాశ్రువులు రాల్చానో..
నా ఈ తలపులు పంచుకొనే తలగడకే తెలుసు..

నీశ్వాసలో మునిగి ఎన్ని పరివేదనలు దాచుకున్నానో..
నా ఈ స్మృతి యవనికలకే తెలుసు..
నీఆశలో తేలి ఎన్ని విరహవేదనలు మిగుల్చుకున్నానో..
నా ఈ గతి పవనికలకే తెలుసు..

నీకోసం విరించినై ఎన్ని ప్రేమలేఖలు రాసానో..
వలపులు నింపుకొనే నా అక్షరాలకే తెలుసు..
నీకోసం విపంచినై ఎన్ని రాగాలు పలికించానో..
తలపులు వొంపుకొనే నా మది గవాక్షాలకే తెలుసు..

ఇవన్నీ నీకై నే రాసే వలపు కావ్యాలు..
ఇవన్నీ నీకై నే దాచే తలపు దృశ్యాలు..

- Inspired by anonymous......

వెళ్లిపోయావా నేస్తం?

  • ప్రచురించిన సమయం: 10:40:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..



వెళ్ళిపోతున్నావా నేస్తం చదివారా? దీన్ని చదివే ముందు దాన్ని చదువగలరని మనవి.

నువు విహరించిన పూతోటలో..
నువు పహరించిన దారిలో..
నే ఏరుకున్న నీ నవ్వుల కుసుమాలన్నీ
నను ఓదారుస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నువు మెరిసిన జ్ఞాపకాల విపణిలో..
నువు కురిసిన కలల ధరణిపై..
నే పేర్చుకొన్న నీ చూపుల సిత్రాలన్నీ
నను నడిపిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నువు విరిసిన నా ఊహల పందిరిలో..
నువు విరచించిన నా ఊసుల మందిరిలో..
నే కూర్చుకున్న నీ నవ్వుల రువ్వులన్ని,
నను పరిహసిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నువు నేను కలిసి నడిచిన సాగరతీరంలో..
నీ పాదాలను ఆర్తిగా స్పృశించిన కెరటాలు..
సైతకసీమల్లో నే నిర్మించుకున్న నీ తలపుల శిల్పాలు..
ఆరాటంగా నా మది ఘోషను వినిపిస్తుంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??

నేను మాత్రం

  • ప్రచురించిన సమయం: 5:17:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

శిలలు ధార ప్రవృత్తికి కరిగినా..
మరులు క్షార వృద్ధితికి క్షీణించినా..
విరులు క్షామ తీవ్రతకి కృశించినా..
నేను మాత్రం నీ వూహల వానలోనే తడుస్తూ వుంటా..

-Inspired By Anonymous poet.

నేను

  • ప్రచురించిన సమయం: 10:43:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


నాలో నేను..
నిత్యం భావ ఝరంపరిలో తడిసి ముద్దై పోతూఉంటాను..
అనునిత్యం అనురాగ శరంపరిలో ఆలంబన పొందుతూఉంటాను..
ఆద్యంతం సంఘర్షణ ఒడిలో స్వాలంబన పొందుతూఉంటాను..

నాతో నేను..
అంతం లేని ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతూ ఉంటాను..
సొంతం కాని కలల ప్రాకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాను..
పొంతన కుదరని వాస్తవాల కడలిని ఈదుతూ ఉంటాను..

నాకై నేను..
ఊహల పందిరి వేసే అనుభూతుల్ని నెమరు వేసుకొంటూ ఉంటాను..
ఊసుల రంగవల్లులు వేసే స్వప్నాలని పరికిస్తూ ఉంటాను..
ఉరికే మది తాలూకు రసానుభూతులలో ఓలలాడుతూ ఉంటాను..

ఏకాంతంలో..

  • ప్రచురించిన సమయం: 9:11:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నువ్వు మిగిల్చిన ఏకాంతంలో, నీవు పేర్చిన జ్ఞాపకాల
అరలని శోధిస్తున్నా.. అక్కడైనా నీ సన్నిధి దొరుకుతుందేమోనని..
నువ్వు విదిల్చిన ఒంటరితనంలో, నీవు మరచిన ఊసుల
దొంతరలని చేధిస్తున్నా.. అక్కడైనా నీ ఊహల నిధి చేజిక్కుతుందేమోనని..

నీవు మిగిల్చిన నిశ్శబ్ధపు నీరవంలో, నీవు విహరించిన కలల కైమోడ్పులైన
చక్షువులని తెరవలేకున్నా.. ఎక్కడ నీ రూపం మాయమవుతుందేమోనని..
నీవు విదిల్చిన అశ్రు తిమిరంలో, నీకై ఎగసిన అలలకై అరమోడ్పులయిన
గవాక్షాలని మూయలేకున్నా.. ఎన్నడైనా నీ అడుగు నా ఎదలోకి ప్రవేశితమౌతుందేమోనని..

అందమైన బాల్యం..

  • ప్రచురించిన సమయం: 1:04:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


అందమైన బాల్యం..
అమ్మ ఒడిలో వికసించి..
అనుభూతుల రెక్కలు తొడిగి..
ఊహాలోకంలో విహరించాల్సిన అందమైన బాల్యం..
పేదరికపు ఒడ్డున రెక్కలు తెగి..
రేపటి ఆశలేని బ్రతుకు ముక్కలు అయి..
రుధిర సంద్రంలో కష్టాల నావ నెక్కి..
అలుపెరగని పోరాటం చేస్తోందీ అందమైన బాల్యం..

అందమైన బాల్యం..
అల్లరి చూపులతో ముద్దు తెప్పించాల్సిన..
చిలిపి చేష్టలతో నవ్వుతెప్పించాల్సిన..
ముద్దు మాటలతో మురిపించాల్సిన అందమైన బాల్యం..
బేల చూపులతో నన్నాదుకోరు అంటూ..
బరువెక్కిన మట్టితట్టలు నే మోయలేనంటూ..
జానెడు పొట్టకోసం అవిశ్రాంతపు శ్రమ జరుపుతుందీ అందమైన బాల్యం..

Followers

తియ్యందనాల తెలుగు.. -