జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
ఎన్ని.. ఎన్నెన్ని..
- ప్రచురించిన సమయం: 5:51:00 PM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: కవితలు..
ఊహల ప్రయాణం ఊపిరి వున్నంత వరకే..
ఊసుల నిరీక్షణం ఊహలున్నంత వరకే..
ఎన్ని చూపులు??
ఎన్ని మాటలు??
కాలం కరిగిపోతుంది, స్వప్నం ఇక చాలు అని కంటిపాప చెబుతుందా?
మది మీటుతున్న భావసరిగమల్ని ఆపమని ఎద చెబుతుందా?
ఎన్ని కలలు??
ఎన్ని అలలు??
సరాగాల అంచులకు.. సుస్వరాల మాలికల్ని చేర్చకు అని రాగమాలిక చెబుతుందా??
హారాల రాగ ప్రభంధాలకు.. మనోహరాల ఆల్లికలని పేర్చకు అని హాలిక చెబుతుందా??
ఎన్ని సరదాలు??
ఎన్ని జ్ఞాపకాలు??
రెప్పల మాటున తన రూపుని దాచకు అని నయనానికి కంటిపాప అడ్డొస్తుందా??
ఊహల చాటున తనని బంధించకు అని మదిలోని రూపు మాసిపోమ్మంటుందా??
ఎన్ని ఊహలు??
ఎన్ని నిట్టూర్పులు??
పెదవి మాటున దాగిన మౌనాన్ని చేధించమని నిశ్శబ్దం అడుగుతుందా??
నాసిక మరవని శ్వాసని తనపైని ఆశ మరచిపోమ్మని కోరుతుందా??
ఎన్ని విరహాలు??
ఎన్ని వియోగాలు??
-----------------------------**********************************-------------------------
(ఇది నేను 9 సం" క్రితం రాసింది. అందుకే కొంత (పూర్తిగానో ?) గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పెద్దలు క్షమించి ముందుకు సాగగలరని నావినతి.)
వెతుక్కోండి.. -
4 people have left comments
Bolloju Baba said:
తెలుగు వాడిని గారు నేనేం చెప్పి స్కిప్ అయి పోదామనుకొన్నానో "అన్నీ" చెప్పేసారు.
సరే పాయింటు కొచ్చేస్తున్నాను.
కొన్నిచోట్ల సమానార్ధకాలను వాడి భావాల్ని మింగేసారు.
ఉదా: సుస్వరాల మాలికల్ని, రాగమాలిక
ఊసుల, ఊహలు,
హాలిక=?
నయనానికి కంటిపాప అడ్డొస్తుందా????????????
ఊహ = మదిలోని రూపు కాదా?
నాసిక మరవని శ్వాసని తనపైని ఆశ మరచిపోమ్మని కోరుతుందా???????????????????
అయినప్పటికీ చెప్పదలచుకొన్న విషయం అర్ధమవుతూనే ఉంది.
ఈ తొమ్మిదేళ్లలో మీ శైలి లోని మార్పు తెలుస్తుంది. తెలుగువాడిని గారు :) మరియు .)
పైన చెప్పినవి నాకు కలిగిన సందేహాలు మాత్రమే. నిందలు కాదు.
బొల్లోజు బాబా
ప్రతాప్ said:
తెలుగువాడిని గారు,
మీరు చెప్పింది నిజమేనేమో, నేను అంతగా ఆలోచించలేదు. నా కవితా శైలిలో, నేను ఎంచుకొంటున్న పదచిత్రాలలో మార్పు నాకే స్పృష్టంగా కనిపిస్తుంది. కవితలు రాయడం అనే అలవాటు నాకెలా అబ్బిందో కుడా నాకు గుర్తులేదు. బ్లాగులోకంలో అందరూ మొహమాటస్తులని నేననుకోను, పొగడ్త నోటినుంచి వచ్చిందో, గుండెలోనుంచి వచ్చిందో కూడా వారు వాడే భాషను బట్టి దాదాపు అందరికీ అర్ధమయిపోతుంది. నేనేదో నాలుగు పిచ్చిరాతలు కుదిరితే పేజీ కథలు రాసుకొనే వాడిని ఇదే నా మీద నాకున్న గొప్ప అభిప్రాయం.
@బాబా గారు,
నిజమే కొన్ని చోట్ల సమానార్ధకాలను వాడాను, కానీ అన్ని చోట్ల కాదు. ఊహ వేరు ఊసు వేరు కదా?
కంటిపాప ఎందుకు అడ్డువస్తుందో మరి? ఇవన్నీ అశేషం కానీ సశేష ప్రశ్నలే మరి.
మదిలోని రూపు అంటే నా ఉద్దేశం ఎవరినైతే మనస్సులో దాచుకొన్నానో వారు అని నా ఉద్దేశం.
"నాసిక మరవని శ్వాసని తనపైని ఆశ మరచిపోమ్మని కోరుతుందా???????????????????"
తనపైన ఉండే ధ్యాసతో నేను శ్వాసని మరిచి పోతానేమో అన్న ఉద్దేశంతో వాడాను.
@తెలుగు వాడిని గారు, బాబా గారు,
చూసారా మరి ఎంత గందరగోలంగా ఉందో?
ఈ కవితను పోస్ట్ చేసేటప్పుడు కూడా నాకు అలానే అనిపించింది, మారుద్దాం అని కూడా అనుకొన్నా. కానీ దీనిలో భావం అనేది ఉంది చూసారూ అది ఎంత ఫ్రెష్ గా ఉందో. అందుకని అలానే వదిలేసా.
తెలుగు'వాడి'ని said:
ప్రతాప్ గారు : ఇది మీ ఒక్కరికే కాదులేండి .. పాత కధలు/కవితలు మొదలగునవి ప్రచురించే అందరికీనూ ... మీరు కవిత కింద 'ఎప్పుడు రాశారు, గందరగోళంగా కనిపిస్తుంది" అని చెప్పటంతో మీ పాఠకులనుండి వచ్చే/రావలసిన ప్రతిస్పందన అనే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారేమో (బాగా) ఆలోచించండి(నాకైతే అవుననే అనిపిస్తుంది). కాలక్రమేణా మీకు ఈ కవితలు రాయటంపై మంచి పరిణితి వచ్చిందనీ, గట్టి పట్టు సంపాదించారనీ లేదా వెధవ కవితలూ, పైత్యం బాగా ముదిరిపోయిందనీ మీకు/మీ బంధుమిత్రులకు అనిపించిన దానికి, మరో కోణంలో నుంచి తెలుసుకునే మహత్తర అవకాశమే ఈ బ్లాగ్. [ మొహమాట పడో లేక మనకెందుకులే అనో 'బాగుంది' అంటే ఒక పని అయిపోతుంది కదా అనుకునే ప్రమాదం కూడా ఉందనుకోండి. అది వేరే విషయం ] కనీసం ఒక్కరన్నా ఇది మీ ముంచు కవితలకన్నా గందరగోళంగా ఉందనో లేక ఎప్పటిలాగా బాగుందనో లేక ఇంకా కొంచెం పదును పెట్టవచ్చో అంటే దాని వలన మీ కవితా రచనా ప్రయాణం ఎటు సాగుతుందో తెలుస్తుంది. మీరు ముందుగానే చెప్పటం వలన 'అవును కదా' అని చదివి వదిలివెళ్లి పోతారు చాలా మంది. అలాగే 'అవునా . అప్పుడెప్పుడో రాసినదాని లాగా లేదండీ. బాగా రాశారు అని చెప్పేవాళ్లు కూడా ఉంటారనుకోండి.