జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
ప్రియమైన నీకు..
- ప్రచురించిన సమయం: 3:11:00 PM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: లేఖలు..
ప్రియమైన నీకు,
ఎలా వున్నావు నేస్తం అంటూ మరుపురాని నీ జ్ఞాపకాలు నను మైమరపిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే ఏమని సమాధానమివ్వను నేస్తం? కుశలమా నేస్తం అంటూ ఊహలపల్లకిలో ఊయలూపేసిన ఊసులు నను ఆరాటంగా స్పృశిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే ఏమని చెప్పగలను నేస్తం? కనులు కనులు కలిసి చూపులతో జరిగిన రాయభారాలు, అన్నిటికీ మౌనమేల, మాట పెదవి దాటదేల, అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే దానికి మౌనమే సమాధానమైతే నేనేమని చెప్పగలను నేస్తం?
తొలిసంజె ఎరుపు నీ సిగ్గుల మోములోని ఎర్రదనాన్ని జ్ఞప్తికి తెస్తూంటే, ఉషోదయపు తుషార బిందువు నీ చూపులోని స్వచ్ఛతను గుర్తుకు తెస్తూంటే, కోయిల కలకూజితాలు నీ స్వరాన్ని దాటిన మధుర పలుకులను పలువరిస్తుంటే ఇలా ఉదయాన్నే నిద్రలేవడం చాలా బావుంది. నీరెండ చురుక్కు నీ చిరుకోపంలోని చమక్కుని కూడా చూపిస్తుంటే ఇంకా బావుంది. కాని ఈ క్షణం నీవు నా పక్కన లేవన్న నిజం నను కాస్సేపు భాధ పెట్టినా, ఇలా నీవు మిగిల్చి వెళ్ళిన ఏకాంతంలో నీవు నాకోసం భధ్రంగా దాచిన మధురోహలు నను పెనవేసుకుంటూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది సుమా.
నేనంతా నీ పలువరింతలతో, రేయంతా నీ కలువరింతలతో నిండినట్లు ఆకాశం అంతా పయోధరాలతో నిండినట్లుంది (అలా కోపంగా చూడకు. నిజ్జంగా నిజం, ఈ పయోధరాలు అన్న పదాన్ని కేవలం మబ్బులు అని చెప్పడానికే వాడాను) . చల్లగాలి అలా మెల్లగా నను స్పృశిస్తూ ఉంటే, పిల్ల తుమ్మెర అల్లన మెల్లన నా శ్రవణాల్లో గిలిగింతలు పెడుతూ ఉంటే, నేనిక్కడ నీకోసం మనస్సునంతా కన్నులు చేసుకొని ఎదురుచూస్తూ ఉంటే, నను ఈ ఒంటరితనపు కైవారంలో బంధిచడం నీకేమన్నా న్యాయమా?
అదిగో వర్షం, నేను నీకున్నా తోడు అంటూ రయ్యిన నా వైపే వచ్చేస్తూ ఉంది. ఇదిగో ఇక్కడ మట్టి వాసన కమ్మగా అచ్చం నీవు నాకోసం కలిపే కాఫీ వాసనలా కమ్మగా నా నాసికకు చేరుతూ ఉంది. నీకు ఈ కాఫీ పిచ్చి పోదా అని కోపంగా అలా చూడకు. ఎంతైనా నీ చేతులతో కలుపుతావు కదా అందుకనే అదంటే నాకు చచ్చేంత ఇష్టం కాదు కాదు చచ్చిపోవాలనిపించేంత ఇష్టం. కాని ఇప్పుడు నువ్వు లేవు కదా అందుకని నేనే కాఫీ కలుపుకొని తాగుతున్నాఇలా కాఫీ తాగుతూ, అలా చిరుజల్లులలో తడుస్తూ, మన పెరటిలోని పూదోటలో తడుస్తూ, నీవు నేను కలిసి పంచుకొన్న అనుభూతుల్ని నెమరు వేసుకుంటున్నా. ఈ పూదోటలోని చెట్లని చుస్తే నాక్కొంచెం అసూయగా ఉంటుంది, నీ ప్రేమని నాతో పాటు పంచుకొంటున్నాయని. అలా నవ్వకు, నాకు కోపం వస్తుంది. ఇదిగో నువ్వు నాటిన మల్లెతీగ చిన్న చిన్న మొగ్గలు పెడుతూ ఉంది. ఈ మల్లెతీగను ఇప్పుడు ప్రేమగా స్పృశిస్తూ ఉంటే నిను తాకిన అనుభూతి కలుగుతూ ఉంది సుమా.
ఇటు చూసినా, అటు చూసినా, ఎటు చూసినా నీ రూపం కనిపిస్తూనే ఉంది. విరహం ఇంత భాధా కరమైనదని యెవ్వరూ నాకెందుకు చెప్పలేదు? అటు, ఇటు ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్ని సరదాలు, ఎన్ని అనుభూతుల్ని మనం మరిచిపోతున్నాం? నాకంటూ ఇప్పుడు శక్తి వస్తే వెనువెంటనే నీ ఎదుట వాలి, నీ ఒడిలో తలవాల్చి పడుకోవాలనిఉంది. నా ఈ అనుభూతుల్ని లిఖిత సంపుటాలుగా మార్చి నీకు అంకితమివ్వాలనుంది. ఇదిగో ఇప్పుడే laptop లో నుంచి పాట వస్తుంది, "నువ్వు.. నువ్వు.." (ఖడ్గం లోది ఈ పాట అనుకుంటా. కదా?). అస్సలు ఇంత మంచి పాటలు ఎలా రాస్తారో కదా ఈ కవులు? మనస్సు మూలల్లోకి తొంగి చూసి, ఎదలోయల్లోని లయలను ఒడిసిపట్టి.
శిశిర said:
చాలా బాగుందండి. అభినందనలు.