జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

దగ్ధగీతం..

  • ప్రచురించిన సమయం: 5:07:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


వింటారా..??
వినీలాకాశంలో తారకలు తలుక్కున అందిస్తున్న..
మేఘలోకంలో మెరుపులు తటిల్లున నినదిస్తున్న..
దగ్ధగీతం..

వింటారా..??
గడ్డిపూలపై నిలిచిన తుషారబిందువుల చారకలు చూపిస్తున్న..
ధరిత్రీతలంపై మొలచిన గడ్డిపరకల మరకలు కురిపిస్తున్న..
దగ్ధగీతం..

వింటారా..??
చీకటిలో వెలుగు పంచుతూ తను కరిగిపోయే కొవ్వొత్తి రాసే..
రెక్కలొచ్చిన పక్షి గూడు వదిలితే కన్నతల్లి పడే తపన మోసే..
దగ్ధగీతం..

వింటారా..??
కొమ్మన కొమ్మన నిలబడలేక కోయిల విలపిస్తున్న..
రెమ్మన రెమ్మనుంచి రాలిపోయే పుష్పాలు ఆలపిస్తున్న..
దగ్ధగీతం..

చూస్తారా ఎదలో నే రాసుకుంటున్న దగ్ధగీతం..
వింటారా మదిలో నే పాడుకొంటున్న దగ్ధగీతం..

6 people have left comments

భావకుడన్ said:

ప్రతాప్ గారు,

మీ బ్లాగులో మీరు రాసిన టపాలు చిన్నవిగా, ఇతరమైనవి..... అంటే archives ఇలాటివి ఎక్కువగా, ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి చూసుకోండి.

పైగా font size మరీ చిన్నగా ఉంది నాలాటి కళ్ళద్దాల వాళ్ళకు ఇబ్బంది అవుతోందనుకుంటాను. వీలవుతే సరి చేయగలరు.

బొల్లోజు బాబా said:

విన్నాను. బాగుంది.

కొన్ని చెప్పాలని ఉంది. చెప్పమంటారా?

మీ పదచిత్రాలు చాలా అద్బుతంగా ఉన్నాయి.
చాలా చాలా మంచి పదచిత్రాలు తీసుకొచ్చారు.

దగ్ధగీతం అన్న పేరు చాలా శక్తివంతంగా ఉంది.

కాని పదచిత్రాలలలోని పదాలు చాలా లలితంగా ఉన్నాయి.
ఒక పవర్ ఫుల్ భావాన్ని చెప్పాలని ఎంచుకొని లలితమైన పదాలను వాడటం ద్వారా మీ కవితలో వైరుధ్యం సాధించారు.

ఇది అందంకోసమా లెక శిల్పం కోసమా అని ప్రశ్నించుకొంటే అందం at the expence of శిల్పం అని నాకు తోస్తోంది. ఇంకా స్ఫష్టం గా చెప్పాలంటే పదాల ఎంపిక సరిగా లేకపోవటం వల్ల శిల్పం (ఫీల్) చెడినట్లనిపిస్తుంది.

నేనేమీ మిమ్ములను విమర్శించటం లేదు గమనించగలరు. ఇది నాకు కలిగిన భావన మాత్రమే.
మీ జవాబును బట్టి నా అభిప్రాయాలను మార్చుకోగలవాడను.

లెట్ అజ్ డిస్కస్.

మీ జవాబుకోసం ఎదురుచూస్తుంటాను.

బొల్లోజు బాబా

కల said:

ప్రతాప్,
బాబా గారితో నేను ఏకీభవిస్తున్నాను. పదాలు ఎంచుకోవడంలో మీరు కనబరిచే శ్రద్ధ సూపర్. కవిత ఎందుకో మొదట కొద్దిగా ఆశావహంగా ప్రారంభమై చివరిలో కొంచెం తడబడింది అని నాకు అనిపిస్తోంది. ఎందుకనో మరి అలా?

ప్రతాప్ said:

రఘు గారు,
కొద్దిగా సరిచేసాను చూసుకోండి. font-size పెంచడం వల్ల టపాలు మరి ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి, అందువల్ల పెంచలేక పోతున్నాను. font-weight ని మాత్రం మార్చగలిగాను.

ప్రతాప్ said:

బాబా గారు మీకు అడ్డు అనేది ఉండదు నా బ్లాగులో, కాబట్టి మీకు అనిపించినవి, కనిపించినవి నిరభ్యంతరంగా చెప్పొచ్చు.
దగ్ధగీతం అన్న పదం నా మదిలో ఎప్పటినుంచో మెదులుతూనే ఉంది. ఈ పదాన్ని ఆసరా చేసుకొని ఏదన్నా కవిత రాయాలని ఎప్పటినుంచో అనుకొంటూనే ఉన్నా. కొద్దిగా ట్రాజెడి గా రాయమని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు, ఎందుకంటే ఈ పదమే అదో రకమైన, అస్పృష్టమైన దిగాలుని చూపిస్తుందని.
నిజమే కదా అని నాకు అనిపించింది, మొదట విరహం, failure అయిన ప్రేమ మీద రాద్దామనుకొన్నా. కానీ ఎందుకో నాకే నచ్చలేదు. కవిత చదివే రసజ్ఞులైన పాఠకులకి కొన్ని అసంపూర్తి ప్రశ్నలని మిగిలిస్తే బావుంటుందేమో అన్న భావంతో ఇలా రాసాను. పదాల ఎంపిక సరిగా లేదు అని అన్నారు, కానీ కొన్ని చోట్ల మాత్రమే సరళత కోసం, చిన్న చిన్న భావాల కోసం అలాంటి పదాలని ఎన్నుకోవడం జరిగింది.

అయ్యో మీరు ఎవ్వరినీ ఎప్పుడూ విమర్శించరు, కవితలోని లోపాలని మాత్రమే ఎత్తి చుపుతారన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి లోపాలని ఎత్తిచూపగలిగే సునిశిత విమర్శకులు దొరకడం నాలాంటి పిచ్చి రాతలు రాసుకోనేవాడికి మహద్భాగ్యమే కదా?

కవితలోని భావం అంటారా, చూద్దాం ఎవరన్నా విప్పగలరేమో, లేక పొతే నేనే మీకు నెమ్మదిగా వివరిస్తాను.

ప్రతాప్ said:

కలా,
ఇప్పుడు ఏమన్నా అర్ధం అయిందా? కాకపోతే కొంచెం ఓపిక పట్టు మరి.