జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అతడొక సైన్యం..

  • ప్రచురించిన సమయం: 10:48:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..అతడొక సైన్యం..
ఎదను మండించిన ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
కుతకుతలాడే రుధిరపు ఆవేశాన్ని కరవాలంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కారే కన్నీటి చుక్కలని తుపాకీ గుండ్లలా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
దూరే పిరికితనాన్ని నిర్జించి, ధైర్యాన్ని ధరించి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కూలే బ్రతుకులు, కాలే కడుపులు, రగల్చిన మంటని మోస్తూ కదులుతున్నాడు కదనరంగానికి..
అవినీతి సెగలూ, అసమర్ధపు చేతలూ, మిగిల్చిన బ్రతుకును మార్చడానికి కదులుతున్నాడు కదనరంగానికి..


అతడొక సైన్యం..
భావావేశపు సున్నితత్వం, కవుల కలాలు, తమ తలరాతను మార్చలేవని తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..
తమ తరపున గొంతెత్తిన గళాలు మధ్యలోనే ఎందుకు మూగపోయాయే తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
తమకు రావలసిన, తనకు కావలసిన పిడికెడు మెతుకుల కోసం కదులుతున్నాడు కదనరంగానికి..
తమ వారికోసం, తన వారికోసం కావాల్సిన దోసెడు గంజికోసం కదులుతున్నాడు కదనరంగానికి..

అతన్నెవరు ఆపలేరు..
బక్క శరీరంపై నాట్యం చేసే లాఠీలు..
తెగిన నరాలపై విహారం చేసే గాయాలు..
శుష్కించిన దేహంలోకి దూసుకెళ్ళే తూటాలు..
కుటిల యుక్తులు, మారణకాండలు,
దమననీతులు, ఏమార్చే మాటలు..
ఇవేవీ అతన్ని ఆపలేవు, ఎందుకంటే ఇప్పుడు అతనొక సైన్యం..

26 people have left comments

చైతన్య said:

ప్రతాప్ గారు చాలా బాగుంది. ఆవేశం , ఆర్ద్రత కలగలిపి బాగా రాశారు.

సుజాత said:

"అసమర్థపు చేతలూ మిగిల్చిన బ్రతుకుని 'మార్చేదానికి ' ...!

మార్చే దానికి అనడం కన్నా "మార్చడానికి" అంటే బాగుంటుందేమో చూడండి! భావం మారదు, భాష అందంగా ఉంటుంది.

కవిత చాలా ఉత్తేజకరంగా ఉంది.

కొత్త పాళీ said:

wow .. a new angle to your writing.
good

Anonymous

Anonymous said:

బాగుంది!

ప్రతాప్ said:

చైతన్య గారు కృతజ్ఞతలు.
సుజాత గారు, నిజమే సుమండీ. అలానే మారుస్తాను.
కొత్తపాళీ గారు కృతజ్ఞతలు.
నెటిజన్ గారు మీక్కూడా కృతజ్ఞతలు.

సూర్యం said:

బాగుంది.

bhagavan cartoons said:

ఆఖరి లైన్లు సూపర్బ్..

బొల్లోజు బాబా said:

మీ కవిత బాగుంది. మంచి ఆవేశం సామాజిక స్పృహ ఉంది.
పై మాటలతో నా కామెంటు అయిపోవాలి. అభినందనలు అంటూ ముగించాలి. కదూ?

కానీ కొన్ని భావాలు పంచుకోదలిచాను.

గత వారం రోజులు గా ఆలోచిస్తున్నాను.
మహా ప్రస్ఠానం అమృతం కురిసిన రాత్రి మరలా చదివాను.

ఒకటే అనిపించింది. అన్నింటిలోనూ కవి తానొక ఉన్నతమైన మానవునిగా, మానవుడు కూడా కాదు మరొక ఉదాత్తమైన జీవి గా భావించుకొని వ్రాసినట్లుగా కనిపించాయి.

నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అన్నా, చిన్నమ్మా వీరందరూ తోక తెగిన ఎలుకలు అన్నా అలా అనటంలో వారెంత ఎత్తున నుంచుని అంటున్నారనేది తలచుకొంటే ఒళ్ళు జలదరించింది.

ఏడుపులు, పెడబొబ్బలు, సెల్ఫ్ పిటీ, నరకమనటాలూ, తన్నమనటాలూ, నైరాశ్యం ఇవేమీ కవిత్వం కావనిపిస్తోంది.

ఎవరు ఒప్పుకొన్నా కాదన్నా పై ఇద్దరూ తెలుగు సాహితీ లోకాన్ని ఊగించి, శాసించి, లాలించిన వారిలో మొదటి ఇద్దరు. (కనీసం నా లెక్కల ప్రకారం).

ఆ స్టైల్ శివారెడ్డిలో, యెండ్లూరి సుధాకర్లో, నందిని శిద్దారెడ్డిలో కనపడుతుంది.


అటువంటి ఆత్మాభిమాన పూరితమైన కవిత్వమే చదువరిని అబ్బుర పరచి, కలకాలం నిలుస్తుందేమోనని అనిపిస్తోంది. ఇప్పటి మీ కవితలా.


అభినందనలతో
బొల్లోజు బాబా

saisahithi said:

అవును అతన్నెవరూ ఆపలేరు....
ఎందుకంటే ? అతడిప్పుడు మనిషి కాడు..
గ్లో'బలీ'కరణ ఉక్కు పిడికిలి లోంచి
పుట్టుకొచ్చిన ఆయుధం !
అడ్డొచ్చినవాణ్ణి తెగనరకటం దాని ధర్మం....
అణచివే్తకి గురయిన అసమర్ధునిలోంచి ప్రభంజనలా పుట్టుకొచ్చే ఆవేశానికి అక్షరరూపమిచ్చారు.
కవిత చాలా బాగుంది.

కల said:

చదివిన తర్వాత అలా స్థబ్ధుగా ఉండిపోయాను. దీనికి ఎటువంటి వాఖ్య రాయాలో కూడా అర్ధం కావడం లేదు. కొత్తపాళీ గారు అన్నట్లు నిజంగా ఇదో కొత్తకోణం నీ కవితల్లో. ఇంతవరకు రాసినవి ఒకెత్తు అయితే ఇది ఇంకోఎత్తు. నా ఉద్దేశ్యం ప్రకారం కవిత చదివిన పాఠకునికి ఆ కవిత ఒకరకమైన ఆవేశమో , ఆర్ద్రతో, ఆలోచనో కలిగిస్తే ఆ కవిత యొక్క జన్మ సార్ధకమయినట్లే. ఈ కవిత పై మూడింటిని పాఠకులకు అందిచ కలిగేలా ఉంది. ముఖ్యంగా చివరి లైన్లు చాలా బావున్నాయి. కాకపోతే "విసర్జించి" అన్న పదాన్ని నేనెందుకో సరిగ్గా అన్వయించుకోలేక పోతున్నాను. ఆ పదం మార్చగలిగే ఛాన్సు ఉంటే మార్చగలవేమో ఒకసారి చూడమని మనవి.

ప్రతాప్ said:

@ సూర్యం గారికి, అలానే భగవాన్ గారికి కృతజ్ఞతలు.

ప్రతాప్ said:

బాబా గారు, మీరన్నది నిజమే. ఒక నిజాన్ని అందరికీ తెలియచెప్పాలంటే కవి తనకు తాను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉహించుకొని అలా రాస్తాడేమో. మహాప్రస్థానం ఒక విలక్షణమైన కావ్యనాయకుడు, మనగురించి మనకే తెలియనంతగా అతనికి తెలుసు. మనది ఒక బ్రతుకేనా అంటు హీసడించినప్పుడు, నిప్పులు చేరుగుకొంటు అంటూ తానేమిటో మనకి తెలియ చెప్పాలని అనుకొంటున్నప్పుడు, తనెంత గొప్పవాడినో మనకి వివరించే ప్రయత్నం అందులో నాకెప్పుడూ కనిపించలేదు. జనాల చేతకానితనాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మాత్రమే చేసాడని నాకనిపించింది.

ఇక అమృతం కురిసినరాత్రి మాత్రం ఒక అందమైన కథానాయిక. ఊసుల్ని ఊహాలోకంలో పరుగులెట్టించగల భావావేశం తనసొంతం. అటువంటి అందమైన కథానాయిక కూడా అప్పుడప్పుడు మన స్థితిగతుల్ని చూసి జాలిపడటం తన హృదయవిదారతకు చిహ్నం.

మీ అభిప్రాయాల్ని నేను ఒప్పుకొంటాను. తెలుగు సాహితీ చెట్టుకొమ్మకు చిటారున పూసిన అద్భుతమైన పారిజాతపుష్పాలు వారు.
ఈ సందర్భంలో నాకొక సందేహాన్ని లేవనెత్తారు. అస్సలు కవిత్వం అంటే ఏమిటి?

ప్రతాప్ said:

కలా,
కవితకు అజరామరత్వాన్ని ఆపాదించినందుకు కృతజ్ఞతలు. 'విసర్జించి' అన్న పదాన్ని విసర్జించమని ఎందుకు అంటున్నావో నాకర్ధం కావడంలేదు. ఇంకో మంచి పదం ఏమన్నా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.

బొల్లోజు బాబా said:

can try

నిర్జించి, వర్జించి

నిషిగంధ said:

ప్రతాప్ గారూ, ఈ ఆవేశం చూస్తుంటే మీలో అపరిచితుడు ఉన్నాడా అన్న అనుమానం వస్తోంది! కవిత చదువుతూ రెండు సార్లు కంఫర్మ్ చేసుకున్నా మీ బ్లాగే అని!! ఇప్పుడు అనిపిస్తోంది మీరూ 'వికాశ్ టైపే అని :-)
కవిత చాలా బావుంది.. అలానే బాబా గారి కామెంట్ కూడా!

రాధిక said:

ప్రతాప్ గారూ నిషి గారి డౌటే నాదీనూ.చాలా బాగుంది.

ప్రతాప్ said:

@నిషిగంధగారు, మీ అభిమానానికి కృతజ్ఞున్ని.
ఈ కవిత చదివేటప్పుడు నాకూ అనిపించింది రాసింది నేనేనా అని. ఏమైనా మీ అభిమానానికి సదా కృతజ్ఞున్ని.
@ రాధిక గారు, మీకూ కృతజ్ఞతలు.

శ్రీసత్య... said:

very energitic & enthusiastic litirature. బాగుంది....

మీ శ్రీసత్య...

ఆనంద ధార said:

ప్రతాప్ గారు.. అతడు ఒక సైన్యం ...కేకండి బాబు.. సమాజానికి చేరవలసిన ఒక మంచి కవిత్వం రాసినందుకు అభినందనలు ..

భరత్ said:

చాల బాగుంది, వివరణ చక్కగా ఉంది.

నేస్తం said:

మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా.. మీ కవితలు కొన్ని చదివా .. చాలా బాగున్నాయి .. keep it up :)

pranu said:

హాయ్ ప్రతాప్ గారు ఎప్పుడే మీ బ్లాగ్ చూసాను ...చాలా బాగావుంది.కవితలు అన్ని బాగావున్నాయీ .మీ బ్లాగ్ డిజైన్ కూడా బాగావుంది ..మీరు ఇలాగే కవితలు పోస్ట్ చేయండి .వుంటాను ...PRANU ...మరచిపోయాను ఫ్రెండ్స్ మీరు ఎవరు ఏన SVUPGCENTRE KAVALI లో చదివి వుంటే మీరు తప్పక మన site ని చుడండి ...www.svupgckavali.page.tl

raju said:

super and fantastic... its really inspiring to every one .....

Srinivas said:

మంచి కవిత, ప్రస్తుత పరిస్థితులకు స్పందించిన రీతి బాగుంది. ఒక్క లైను రాయాలనిపించింది.

ఇప్పుడు అతనొక సైన్యం
నిలువదు అతనిముందిక దైన్యం!
========
శ్రీనివాస్

Commentors on this Post -