జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అడవి మల్లి

  • ప్రచురించిన సమయం: 11:05:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కథలు

గమనిక:
ఇందులోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఈ రచన నా సొంతం. ఎవరైనా వాడినచో చట్టప్రకారం చర్యలు తీసుకోబడును. ఇక చదవండి.
========================================================

అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలా యాభై నిముషాలు..అప్పటివరకు అందరికీ వెలుగును పంచిన సూరీడు విశ్రాంతి కొరకు వేగిరపడుతూ పశ్చిమాన ఉన్న కొండల చాటుకు వెళ్ళిపోతున్నాడు. మేము ప్రయాణిస్తున్న జీపు గుంతల్ని దాటుకుంటూ, గతుకుల్లో ఎగిరెగిరి పడుతూ లేస్తూ దుమ్మురేపుకుంటూ సాగిపోతూ ఉంది. ఆ జీపులో నేను, ప్రసాద్, అభి మరియు రాధిక డ్రైవరు తో కలిపి మొత్తం ఐదుగురున్నాము. మేమంతా మా I.F.S.(Indian Forest Service) ట్రైనింగ్ ముగించుకొని ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇలా నల్లమల్ల అడువుల్లోని మా అటవీశాఖ గెస్ట్ హౌస్ కి బయలుదేరాం.

ప్రసాద్ పేరుకు తగ్గట్లే చాలా సౌమ్యుడు. వాడు నేను చిన్నప్పటినుంచి స్నేహితులం. నేను ఏం చదివితే అదే చదవడం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అలవాటును ఇలా I.F.S. లో కూడా వదలలేదు. ఇక పోతే అభి, వాడు ఆరడుగుల అందగాడు. ఏదో వాడి టైం బావోలేక ఇలా మాలో వచ్చి పడ్డాడు. వాడి గురించి చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఇంకోటిఉంది. వాడికి ఏ అమ్మాయన్నా నచ్చితే ఆ అమ్మాయిని కౌగిలిలోకి చేర్చుకోనేవరకు నిద్రపోడు. ఇక రాధిక, తను చాలా ఇంటెలిజెంట్. I.F.S. ఆల్ ఇండియా టాప్ రాంకర్. చాలా డైనమిక్. కాకపోతే ఆ అమ్మాయి బలహీనత వాగుడు. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఇక నా విషయానికొస్తే, నేను కొంచెం భావుకున్ని. కవితలు రాసుకొంటూ, చెట్టూ చేమా వదలకుండా తిరగడం నా హాబీ.

"ఇంకా ఎంతసేపు?" అన్న మా అభి గాడి మాటలతో అలా ప్రకృతిని చూస్తూ పరవశిస్తున్న నాకు ధ్యానభంగమయింది. "ఎంతో దూరం లేదు సారూ. ఇంకా పది నిముషాల్లో చేరుకుంటాం." అన్న మా డ్రైవర్ మాటలతో అందరం ఊపిరి పీల్చుకొన్నాం. అలా గతుకుల రోడ్ల పైన ప్రయాణం చెయ్యాలంటే ఎవరికన్నా విసుగే కదా?

మా డ్రైవర్ చెప్పినట్లే కరెక్ట్ గా పది నిముషాల్లో మా గెస్ట్ హౌస్ ని సమీపించాం. జీపు హారన్ శబ్దం వినగానే ఒక నల్లటి వ్యక్తి పరుగు పరుగున వచ్చి గేటు తీసాడు. మేమంతా జీపు దిగగానే మా డ్రైవరు "రంగయ్యా" అంటూ అతన్ని పిలిచి మమ్మల్నందరినీ పేరు పేరునా పరిచయం చేసాడు. తర్వాత డ్రైవరే మావైపు తిరిగి "సార్లు, ఈయన రంగయ్య. ఇక్కడి వాచ్ మాన్. మీకేం కావాల్సిన ఈయన్ని అడగండి. ఇప్పటికే లేటు అయింది ఇంటికాడ మా ఆవిడ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తా సార్లు" అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే అభి, "వీడేంట్రా? అందరిని కలిపి సారూ, సారూ అంటాడు?" అనగానే వెంటనే ప్రసాదు అందుకొని "ఈ మేడం(రాధికని చూపిస్తూ) పాంటు-షర్ట్ లో ఉండేసరికి కన్ ఫ్యూజ్ అయ్యుంటాడురా" అనగానే అందరం మనస్పూర్తిగా కలిసి నవ్వుకొన్నాం.నాకు ప్రసాదులో నచ్చేది అదే, ఆ స్పాంటేనియటి. సందర్భానుసారంగా జోకులు వెయ్యడంలో వాడికి వాడే సాటి. ఇక రాధిక ఐతే చెప్పనవసరం లేదు. తన పైన ఎన్ని జోకులు వేసుకున్న అస్సలు పట్టించుకోదు. పైపెచ్చు మాలో కలిసి ఆ జోకుల్ని ఎంజాయ్ చేస్తుంది. తను టాపర్ అన్న అహంభావాన్ని అస్సలు చూపదు. ఇలా మేమందరం ఎంజాయ్ చేస్తూంటే రంగయ్య "మల్లీ" అంటూ ఎవరినో పెద్దగా పిలిచాడు. ఆ పిలుపుకు ప్రతిగా "వత్తున్నా మావా" ఏదో ఒక కోయిల కంఠం వినిపించింది. ఎవరిదీ ఈ కంఠం అనుకొంటూ అందరం కుతూహలంగా అటువైపు తిరిగాం.

అంతే, కళ్ళ ముందర ఓ మెరుపు మెరిసినట్లైంది నాకు. ఆ మెరుపు నెమ్మదిగా ఒక ప్రౌఢ రూపం దిద్దుకొన్నది. పాతకాలం నాటి నేత చీర ఒక్కటే కట్టి, చేతులకు అడవిపుత్రులు వాడేటటువంటి కడియాలు తగిలించి అచ్ఛమైన మల్లి పువ్వు లానే ఉన్నది ఆ మెరుపు.వెంటనే నాలోని కళాకారుడు నిద్రలేచాడు. అయ్యో తన కళ్ళని కాళిదాసు చూడలేదే, చూసుంటే మరో అభిజ్ఞాన శాకుంతలము రాసేవాడేమో. అయ్యో తన ముక్కుని ముక్కుతిమ్మన చూడలేదే, చూసుంటే సత్యభామ ముక్కు బదులు ఈమె ముక్కు గురించి "నానా సూన వితాన వాసనలనానందించు.." అంటూ సాగిపోయేవాడేమో. అయ్యో తన మధునిలయాలను శ్రీనాధుడు చూడలేదే, చూసుంటే శృంగారనైషధం లో నలుని విరహగ్నికి బదులు, తన విరహాగ్నిని లిఖించి వుండేవాడేమో. అంతవరకూ ఎందుకు? నండూరి వారు ఈమెని చూసుంటే ఎంకి బదులు ఈమెని కధానాయికగా పెట్టుకోనేవారేమో అని నాలోని భావుకడు గగ్గోలు పెట్టసాగాడు. కాని నాకు మాత్రం ఈమెని చూడగానే "అడవి మల్లి" అన్న పదప్రయోగం ఎలా వచ్చిందో అర్ధం అయింది. ఇలా నేను సుప్తావస్థలోనుండగా ఎందుకో హఠాత్తుగా అభి వైపు చూసాను. అప్పుడే వాడు నా వైపు తిరిగి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూడగానే నాకు అర్ధం అయింది వాడి చూపు ఆ ప్రౌఢ మీద పడిందని నేను ఖచ్ఛితంగా పక్కకి తప్పుకోవాలని.

ఇలా అందరం ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా మల్లి రంగయ్య దగ్గరికి వచ్చి నిలబడింది. రంగయ్య తనని మా అందరికి పరిచయం చేస్తూ "సార్లు, నా యింటిది. పేరు మల్లి" అని చెప్పి మల్లి వైపు తిరిగి "ఏంటే అట్టా సూత్తున్నావు? యీల్లు సార్లు. పట్నం నుంచోచ్చారు. తానం సేత్తారు. నీల్లెట్టు" అని పురమాయించాడు. తను అలా వయ్యారంగా నడుస్తూ వెళ్తుంటే నేను, అభి కళ్ళార్పడం మరిచిపోయాము. అలా కాస్సేపట్లో స్నానం మరియు భోజనాలు చేసి అందరం విశ్రాంతి తీసుకుంటామని చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వేళ్ళిపోయాం. నన్ను మాత్రం నిద్రాదేవి వెంటనే కరుణించలేదు. కలల్లో సైతం మల్లి గురించిన ఆలోచనలే. తను, అభి కలిసి అడవిలో విహరిస్తున్నట్లు, జలపాతాల్లో సరిగంగ స్నానాలు చేస్తున్నట్లు. ఇలా ఎన్నో అర్ధంపర్ధం లేని కలలతో తెలతెలవారగా ఎప్పుడో నిద్రపోయాను.

గుడ్ మార్నింగ్ అన్న రాధిక పిలుపుతో నాకు మెలుకువ వచ్చింది. అప్పుడే వినిపిస్తున్న పక్షుల కిలకిలారావాలు, ప్రక్కనే తలస్నానం చేసి తడికురులతో, చేతిలో కాఫీ కప్పుతో నిలబడి, నన్నే చూస్తూ ఉన్న నా ప్రాణస్నేహితురాలు. ఎందుకో ఆ క్షణం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇటువంటి గుడ్ మార్నింగ్ ఇంతవరకు నేనెరుగను. కాని నా ఈ సంతోషం కొద్దిస్సేపట్లో ఆవిరి అవ్వబోతున్నదని ఆ క్షణం నాకు తెలీదు. "ఏరా! ఇంకా ఎం ఆలోచిస్తున్నావు? లే లే. పద రెడీ అవ్వు. అడవిలోకి వెళ్ళాలి" అన్న తన మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కాఫీ కప్పు అందుకొని "థాంక్స్" చెప్పి అలా బాల్కనీ లోకి నడిచాను. బాల్కనీ లోంచి మల్లి కనిపిస్తుందేమో అన్న ఆశ తోనే సుమా. కాని ఆ బాల్కనీ లోంచి కనిపించిన దృశ్యం నన్ను కాస్సేపు నిరత్తురుణ్ణి చేసింది.

అక్కడ నాకు కనిపించిన దృశ్యం ఇది, అభిగాడు ఏదో జోక్ వేసినట్లున్నాడు, మల్లి విరగబడి నవ్వుతూ ఉంది. ఆ నవ్వడం కూడా వొళ్ళు తెలియకుండా. ఆ నవ్వులకి తనకు కనువిందు చేస్తున్న మల్లి పయోధరాల కదలికల్ని అభి గాడు చూపులతోనే జుర్రు కొనేస్తున్నాడు. అమ్మో అప్పుడే వీడు రంగంలోకి దిగిపోయాడన్న మాట. ఎలాగైనా సరే, దేవదేవాదులు అడ్డొచ్చినా సరే, మల్లిని నా దారి లోకి తెచ్చుకోవాలని ఆ క్షణమే గట్టిగా ప్రతినబూనాను. కాని రంగంలో అభిగాడు ఉన్నంత వరకు అది అంత సులభం కాదని నాకు తెలుసు. ఇంతలోనే అభిగాడు, "మల్లీ ఇక్కడ ఏదో మంచి జలపాతం ఉందంట కదా? దాన్ని నాక్కొంచెం చూపిస్తావా?" అని అడిగాడు. "ఇక్కడే, దగ్గిరే సారూ. ఓ రెండు పర్లాంగులు ఉంటుంది." అని మల్లీ చెప్పగానే మా అభిగాడు "ఆయితే ఇప్పుడు వెళ్దామా?" అని అడిగాడు. దానికి మల్లి "కాని సారూ, అక్కడ సుడిగుండాలెక్కువ." అనగానే దానికి వీడేమో "పర్లేదులే. నేను మరి ఎక్కువ లోతుకి వెళ్ళను" అన్నాడు. మల్లి "సరే సారూ. మీలు నాస్టా చెయ్యండి. తర్వాత ఎల్దాం." అని చెప్పింది. ఈ సమాధానం వినగానే నాకు స్పృహ తప్పినంత పనైంది. "అమ్మో వీడు కాని ఆ ప్రౌఢతో కలిసి అడివిలోకి వెళ్తే ఏమన్నా వుందా? వీడు ఆ తనని ఊరికే వదిలి పెడుతాడా?" ఈ ఆలోచన రాగానే నేను వెంటనే రంగంలోకి దిగాను. "అభి మనం అంతా కలిసి అడివిలోకి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు వెళ్తే మనం అడివిలోకి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది." అని నేను బాల్కనీ లోనుంచే అడ్డం పడ్డాను. మా వాడు ఏమన్నా తెలివి తక్కువ వాడా? "పర్లేదు లేరా. దగ్గరే కదా. ఒక అరగంటలో వచ్చేస్తాం. మీరు రెడీ అయ్యేసరికి ఎలాను ఒక గంట పడుతుంది." అని పెద్దగా నాకు వినబడేలా చెప్పి మల్లి వైపు తిరిగి, "మల్లీ! నేనిప్పుడే టిఫిన్ చేసి వస్తా. మనం ఇద్దరం మాత్రమే కలిసి అడివిలోకి వెళ్దాం" అని చెప్పి వాడి రూం లోకి వెళ్ళాడు. "మాత్రమే" అన్న పదం నాకు మాత్రమే వినిపించింది. దానికి అర్ధం తెలియనంత ముర్ఖున్నేమి కాదు. అయిపోయింది. అంతా అయిపోయింది. నాలోని భావకున్ని తట్టి లేపిన నా అడివిమల్లి వేరొకరి సొంతం అయిపోబోతుంది అన్న ఊహ రాగానే నన్నేదో నిస్సత్తువ ఆవరించింది.

ఇంతలోనే మా అభిగాడు రెడీ అయ్యి రావడం మల్లితో కలిసి బయలుదేరడం అంతా నా కళ్ళ ముందరే జరుగుతూంటే నేను కాఫీ తాగడం తప్ప ఇంకేమి చెయ్యలేని నిస్సహాయుణ్ణి అయిపోయాను. వాళ్లు అలా వెళ్ళడం చూసిన రాధిక "ఏంట్రా? అభిగాడు ఏదో పెద్ద ప్లాన్ లో వున్నట్టున్నాడు." అని నన్ను అడగగానే నాకు పుండు మీద కారం రాసినట్లయింది. నా మౌనమే ఆ ప్రశ్నకి సమాధానం అయింది. నా మౌనాన్ని తను పట్టించుకోకుండా, "సరే కానీ, నువ్వు రెడీ అవ్వు. అబ్బ ఈ ప్రసాదు గాన్ని కూడా నిద్ర లేపాలి." అంటూ నేను ఖాళీ చేసిన కాఫీ కప్పు తీసుకొని వెళ్లిపోయింది. తను అలా వెళ్ళడం డ్రైవరు జీపు తీసుకొని రావడం ఒకేసారి జరిగాయి.

ఇంకో అరగంటలో అందరం రెడీ అయ్యి జీపు దగ్గరికి చేరుకున్నాం. అందరం అక్కడికి చేరుకోగానే ప్రసాదు "అభి గాడు ఎక్కడ?" అని నన్ను అడిగాడు. నేను వాడికి జరిగినదంతా చెప్పాను. అంతా విన్న తర్వాత వాడు, "అయినా వాడికి ఈత రాదు కదా? ఇప్పుడు ఎందుకు వెళ్ళాడో?" అనగానే, మా డ్రైవరు "సారూ, అక్కడ భయంకరమైన సుడిగుండాలు ఉంటాయి. అక్కడ ఈతకి దిగడం చాలా ప్రమాదం." అనగానే అందరికీ గుండె ఝల్లుమంది. నేను వెంటనే "నీకు ఆ జలపాతంకి దారి తెలుసా? తెలిస్తే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. తొందరగా." అని అతన్ని హడావుడి పెట్టాను. అతను వెంటనే "రండి సారు, ఎక్కండి" అని అందరం ఎక్కిన తర్వాత జీపుని ముందుకి ఉరికించాడు.

పదినిముషాల్లో ఆ జలపాతం దగ్గరికి అందరం చేరుకొన్నాం. అక్కడ మాకెవ్వరు కనిపించలేదు. అందరూ కంగారుపడ్డారు ఒక్కనేను తప్ప. నేను ఏమైతే అనుకొన్నానో అదే అయింది. అభిగాడు నేను అనుకొన్నంత పని చేసాడు. వీళ్ళ పిచ్చి కాకపొతే వీళ్ళు అంతా నీళ్ళల్లో వెతుకుతున్నారు. వెళ్లి అడవిలో ఉండే పొదల చాటున వెతికితే కన్పిస్తారు అని నా ఆత్మారాముడు ఘోషించడం మొదలు పెట్టాడు. ఇంతలో మా ప్రసాదు గాడు "రేయ్" అంటూ నన్ను పిలిచాడు. "ఏంటి రా?" అన్న నా ప్రశ్నకు బదులుగా "ఇలా రా" అని కళ్ళతోనే సైగచేసాడు. నేను అన్యమనస్కంగా అటువైపు నడిచాను. అక్కడ అభిగాడి బట్టలు, షూ అన్నీ కుప్పగా పడి వున్నాయి. కాని వాళ్ళిద్దరి జాడ మాత్రం లేదు. ఇంతలో మమ్మల్ని చేరుకున్న మా డ్రైవరు, రాధిక వాటిని చూసి కాస్త ఆందోళన పడ్డారు. అందరం కలిసి పెద్దగా "అభీ, అభీ" అంటూ పిలవడం మొదలు పెట్టాము. అంతలో ఆ జలపాతం హోరులో ఎక్కడో లీలగా ఎవరో మూలుగుతున్న శబ్దం నను లీలగా చేరింది. హడావుడి చేస్తున్న మా వాళ్ళందరిని కాస్సేపు నిశ్శబ్దంగా ఉండమని చెప్పి అందరితో కలిసి అటువైపు నడిచాను. అక్కడ మాకు కనిపించిన దృశ్యం మమ్మల్నందరినీ ఊపిరి బిగపట్టేసేలా చేసింది.

అక్కడ.. మా అభిగాడు సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాడు. ఆ సుడిగుండం లోని నీళ్ళతో పాటు గిరగిరా తిరుగుతూ "నన్ను కాపాడండి.. హెల్ప్ హెల్ప్.." అంటూ పెద్దగా అరుస్తున్నాడు. కాని ఆ జలపాతం హోరులో వాడి అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు. కాని ఆ దృశ్యం నన్ను పెద్ద ఆశ్చర్యపరచలేదు. కాకపోతే కాస్సేపు కాళ్ళుచేతులు ఆడకుండా చేసింది. అందరిదీ అదే పరిస్థితి. కాని మల్లి చేస్తున్న పని చూసి మా అందరికి నోట మాట రాలేదు. దేన్నైతే స్త్రీ తన ప్రాణం కన్న ఎక్కువగా భావిస్తుందో ఆ మానాన్ని కుడా లెక్క చేయకుండా తన వొంటి మీద వున్న ఏకైక చీర మొత్తం విప్పి, దాన్ని వాడికేసి విసిరి వాడిని కాపాడేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాడేమో ఆ చీరను పట్టుకొని కూడా భయవిహల్వుడై అరుస్తూనే ఉన్నాడు. మల్లి తన బరువు మొత్తం ఒక రాతిపై వేసి వాడిని ఆ సుడిగుండంలోంచి బయటకు లాగేదానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో వాడి బరువు తను మోయలేక,లాగలేక తన శరీరం ఆ రాతికేసి ఒరుసుకొని రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వాణ్ణి కాపాడేదానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంతలో మేము తేరుకొని వెళ్లి ఎలాగోలా కష్టపడి వాణ్ణి ఆ సుడిగుండంలోంచి కాపాడేము. బయటకు వచ్చిన అభి షాక్ వల్ల స్పృహ తప్పిపడిపోయాడు.

స్పృహ తప్పిన అభిని వెంటనే జీపులో వేసుకొని అక్కడే వున్న ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాం. ఆ కంగారులో మా అభిగాడిని కాపాడిన మల్లిని అక్కడే వదిలి వచ్చేశాం అన్న సంగతి "మల్లి ఎక్కడ?" అని రాధిక నన్ను అడిగేంత వరకు మాకు ఎవ్వరికీ తట్టలేదు. వెంటనే నేను, ప్రసాదు జీపు వేసుకొని జలపాతం దగ్గరికి వెళ్ళాం. కాని అక్కడ మల్లి లేదు. తర్వాత గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాం. కాని అక్కడ కుడా మల్లి కాని, రంగయ్య కాని ఎవ్వరు కనిపించలేదు.వుస్సూరుమంటూ హాస్పిటల్ కి తిరిగి వచ్చాం. అక్కడ మల్లిని, రంగయ్య ని చుసిన మాకు ప్రాణం కుదుటపడింది. అందరం కలిసి అభి వున్న రూమువైపు నడిచాం. మేం వెళ్ళేసరికి అభి గాడికి స్పృహ వచ్చివుంది. రాధిక ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉన్నాడు. అప్పుడే రూం లోకి వస్తున్న మల్లిని చూసిన వాడి కళ్లు మెరవడం గమనించాను.కాని ఎందుకో మాత్రం అర్దం కాలేదు. అప్పుడే రూము లోకి వచ్చిన డాక్టరు "ఇక పర్లేదు. షాక్ వల్ల కాస్త స్పృహ తప్పింది. ఇక ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు" అని చెప్పాడు. ఆ మాటలకి అందరం హాయిగా ఉపిరి పీల్చుకొన్నాం. అంతలోనే రాధిక డాక్టరు వైపు తిరిగి, "డాక్టరు గారు, వీడిని కాపాడటంలో ఈ అమ్మాయికి దెబ్బలు తగిలాయి. కాస్త చూడండి" అని అన్నది. "ఏంకాలేదమ్మగోరు" అంటూ మల్లి తప్పించుకోవాలని చూసింది. కాని మేం అందరం తనని వదలలేదు. తనని నేను, రాధిక కలిసి బలవంతంగా డాక్టర్ రూములోకి తీసుకెళ్ళి తన గాయలకి డ్రెస్-అప్ చేయించాము. తనని బయటకు తీసుకు వస్తూ నా మనస్సులో ఉన్న సందేహాలన్నింటిని బయటపెట్టాను.

"మల్లి, మా వాడిని ప్రాణాలకి తెగించి మరీ కాపాడావు. కాని అలా కాకుండా ఇంకెలాగో ఒకలా ప్రయత్నించోచ్చు కదా?" అని అడిగాను. "సారూ, ఇలా రెండేళ్ళ కాడ నా చంటోడు దాంట్లోనే పడ్డాడు. నేను తాడు కోసం చూసేసరికి ఆడు మమ్మల్ని వోగ్గేసిపోయిండు. నాలా మరే తల్లికి వొద్దు. నా చంటోడు పెద్దోడు ఐతే గచ్చు ఆ సారులానే ఉంటడు. అందుకే అట్ట కాపాడినా. సారూ మీరంతా చల్లగుండాలే. మీరంతా చల్లగుండాలే." అంటూ చెమ్మగిల్లిన కనులతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను మాత్రం స్తబ్దుణ్ణి అయ్యాను. తన చెప్పిన మాటల సారాంశం ఇంకా నా చేవుల్లోనే "మీరంతా నా బిడ్డలాంటోళ్ళు!! బిడ్డలాంటోళ్ళు!!" ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంతలో నా భుజం మీద ఎవరో ఆసరా కోసం చెయ్యి వేశారు. చూద్దును కదా తడి కళ్ళతో అభి. మా మాటలన్నింటిని విన్నట్లు వాడి వాలకమే చెబుతోంది. ఇంతలోనే వాడు నన్ను పట్టుకొని బావురుమన్నాడు. ఓదార్చడానికి ప్రయత్నించబోతున్న ప్రసాదుని, రాధికని చూపులతోనే వారించాను. వాడి మనస్సులోని కల్మషం, నా మనస్సులోని కుత్సితం అంతా మల్లి పునాదుల్తో సహా పెకిలించి వేసింది. కాస్సేపటికి వాడు తేరుకున్నాడు. మా ఇద్దరి చూపులు కలుసుకొన్నాయి. వాడి కళ్ళలోని సంఘర్షణని నేను చూడగలిగాను. ఎందుకంటే ఇంచుమించు నాది అదే పరిస్థితి. ఎవరో చెప్పినట్లు,
జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడేదానికి,
సంఘర్షణ నాంది..
ఆలోచన పునాది..
వ్యక్తిత్వం భవంతి..
అలాంటి సంఘర్షణతోనే మొదటిఅడుగు వేసి మా ప్రయత్నాన్ని ఆరంభించాం.

15 people have left comments

Anonymous

Anonymous said:

Naku e roja telisindhi meru kavithala kadhu kadhalu kuda rastaru anee. kadhalo edo kothadanam undi andi. endukante a varnana chadutunta kalla mundhu a sambhashana jarugutunattu undi nenu ekkuva ga stories chadavadaniki ista padanu kani me narration nenu chadivala chasindi.me title kastha variety ga undi. keep it up. last but not least once again me narration chala bagundi.

Anonymous

Anonymous said:

Thanks andi intha tondaraga meru megatha story rastaru anu koledu. ninnati nunchi evaridi a koyela swarama ani anlochincha danika sari poindi. nenu oka nijam chapana naku kalidasu 'Abhijyana sakunthalam' kani mukku timmana kani teliyadhu. okka srinadhudi 'parvathi tappasu' tapinchi. meru chapina varnanalo ethanu okkada naku telisindi. but nijam chapali ante ammaini ala kuda varninchachu ani e roja telisindi. me varna chala bagundi. and one more madhu vanambulu ante emiti koncham chapara. malli last lo twist. eme chusaru meru plz chapara. endukandi ela tension pedataru edo chadavaka chadavaka manchi story chadutunte. k tondaraga continuation riandi.

ప్రతాప్ said:

మధువనాలు అని కాకుండా మధునిలయాలు అని వాడాల్సింది అచ్చు తప్పు. దాన్ని సరిచేశాను చూసుకోండి.

Unknown said:

chala baga rasavu prathap
Keep it up

Anonymous

Anonymous said:

e genre lo mee lanti oka kavi writer unnarante.. nammalenu.. kaani nammakunda kuda undalenu...!

mee kavitvalu super they alwaz leave me thinking!! ... asalu oka feeling ni intha manchi padamulanu samakurchi intha baaga rayatam andari taram kaadu... me story kuda chala adbuthanga vundhi

just keep up the good work!

i will miss reading ur writing if u stop it some day.. just dont even think of doing that!!

ప్రతాప్ said:

మీ అభిమానానికి సదా కృతజ్ఞున్ని.

Anonymous

Anonymous said:

wait for next part.i think abhi ki
sorry sorry mee kada naa uha match auvuthundoledo chuthanu.any way very nice.

భావకుడన్ said:

ప్రతాప్ గారు,
మీ రచనలు చదవటం మొదటి సారి. కథ బావుంది. నాకు అన్నిటి కంటే నచ్చినది మీ భావుకత. వెంటనే నా favourites లో చేరి పోయింది మీ బ్లాగు.

భాషా, భావుకత, వర్ణన, శైలి, అన్నీ బావున్నాయి.
కొన్ని చోట్ల paragraphs మరీ పెద్దవి అయ్యాయి అనిపించాయి. మొత్తానికి చాల బావుంది. మీ నైజానికి (భావుకతకు) సరిపోయే ముగింపును ఇచ్చారు అభిని కూడా మార్చి.

మీరు చెప్పినట్టు సంఘర్షణ, ఆలోచన, వ్యక్తిత్వం మంచి మనిషిని చేసేవి అయితే, వ్యక్తిత్వమే పునాది. అది లేనపుడు మనిషి ఎదురైన సంఘర్షణలతో ఆలోచన మొదలెట్టడు, మార్పుకు శ్రీకారం chuttadu.

కాబట్టి మీ పాత్రల నైజ పరంగా అయితే ఇక్కడ మారేది ఒక్క "నేను" అని పరిచయం చేసుకున్న పాత్ర ఒక్కటే. మీ పాత్రల పరిచయాన్ని బట్టి అభి మారడం అనేది అతని స్వభావ విరుద్ధం.

"భావకున్ని" అన్నారు--"భావుకత" కాబట్టి "భావుకున్ని" అనాలనుకుంటాను. ఎవరో చెప్పే వరకు నాకూ తెలీదు. నా పేరులో నేను చేసిన పొరపాటే మీరు చేస్తున్నారని అనిపించి చిన్న సూచన అంతే.

మీ అభిమాని

ప్రతాప్ said:

ముందుగా మీ అభిమానానికి కృతజ్ఞున్ని..

మీలాంటి సునిశితమైన పరిశీలనాశక్తిగల చదువరుల చేతిలో నా కథ పడటం నిజంగా నా అదృష్టం.

అంతఃసంఘర్షణ ఎప్పుడు మనిషిని ఆలోచనల్లో పడవేస్తుంది. నేను చేసేది తప్పా? ఒప్పా అని? కాబట్టి సంఘర్షణ అనేది ఆలోచనలకు అరంభం అని నేనంటాను. ఆలోచన అనేది మనిషిలోని మార్పునకు దోహదం చేస్తుంది (అది మంచా, చెడా అన్నది అప్రస్తుతం). ఆ ఆలోచనలని బట్టే వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది (వ్యక్తిత్వం అనేది చెడా, మంచా అనేది ఎవ్వరు నిర్ణయించలేరు). మీరు చెప్పినట్టు మనిషి స్థిరమైన అభిప్రాయాలని ఏర్పరచు కోవాలి అతనికి సొంత ఆలోచనలనేవి రావాలి. ఆలోచనలు సంఘర్షణ అనే కొలిమిలోనుంచి పుడతాయి. అంతే కానీ వ్యక్తిత్వం అనే పునాదుల మీద నిర్మించబడవు. నేను ఉదహరించిన ఆ మంచిమాట ఎక్కడో చదివాను. అది నా సొంతవాక్యం కానే కాదు (అది నేను నా కథ లోనే చెప్పాను).

ఇకపోతే అభిలోమార్పు అంటారా, నేను ఒక్కడినే మారితే చదివే వాళ్ళకి అభి క్యారెక్టర్ మీద సానుభూతి రాదు. కథలో హీరో కూడా అభినే, అంతే కాని నేను కాదు, కాకపోతే కథ పరంగా చిన్న ప్రయోగం చేశాను. కథ అంతా ఏదో ఒక క్యారెక్టర్ వైపు నుంచి చెప్పుకు రావటం (రచయితని కాబట్టి ఆ మాత్రం స్వాతంత్ర్యం వుండాలని కోరుకోవడంలో తప్పులేదనుకొంటాను). కొన్ని చోట్ల paragraphs పెద్దవి అయిపొయాయి. ఇది రాసేటప్పుడు నాకు కూడా అనిపించింది. కాకపోతే నేను రాసేది కవితో, పద్యమో కాదు కదా, అన్నింటిలోను ఒకే మాదిరిగా పదాలు, ఖచ్ఛితంగా ఇన్నే వాక్యాలుండాలి అన్న నిభంధనలు కథలకి వర్తించవు కదా? అని నన్ను నేను సరిపెట్టుకొన్నాను.

మీరు చెప్పినట్టు భావుకత అన్నదే అస్సలైన పదం. పొరపాటున ఆ పదం టైపు చెయ్యడం జరిగింది. అచ్చుతప్పుని సరిదిద్దుకొంటానని మీకు హామీ ఇస్తున్నాను.

భావకుడన్ said:

ప్రతాప్ గారు,

మీ రచనలపై సర్వ హక్కులు మీవే-ఆ పేరా నిడివి సూచన మీరు గమించలేదేమో అని చెప్పినదే కాని తప్పని సరిగా ఇంట నిడివి ఉండాలి అని ఎక్కడా లేదండి. కేవలం పాఠక సౌలభ్యం కోసం చెప్పినది అంతే.

ఇక పొతే మీ అభి గురించి-realism ఇష్ట పడే వాడిని కాబట్టి, psychiatrist ను కదా నాకు మనుషుల నైజం గురించి తెలుసు అనే అహం కూడా ఉండి ఉండుచ్చు ఆ వ్యాఖ్యలో చెప్పలేను. ఇక్కడ కూడా మీరన్నట్టు అది మీ హక్కు ఎ పాత్రలు ఎలా మార్చాలి అనేది.

ఇక పొతే quote, నాకు చాల బాగా నచ్చిన quote అది వెంటనే నా favourites లో చేరిపోయింది అది. కాని దానితో ఏకీభవించలేదు.

దాన్ని గూర్చి ఇంకో వ్యాఖ్యలో వివరంగా రాస్తాను.
వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి ప్లీజ్. ఈ బ్లాగు స్పోటు వాడు అది ప్రతి దానికి default గా పెట్టి చంపుతున్నాడు.

ప్రతాప్ said:

అయ్యో రఘు గారు, నా ఉద్దేశ్యం అది కాదండి. నాకా కధ రాయడానికి రమారమి నెల రోజులు పట్టిందండి. కొంచెం కొంచెం రాసి, రాసిన దాన్నే బాలేదని మళ్లీ మళ్లీ మార్చి రాయడానికి అన్ని రోజులు పట్టింది. కాకపోతే కధ రాయడంలో నేను కొంచెం స్వార్ధంగా ప్రవర్తించాను. కధలో కొంచెం భావుకత ఎక్కువయిందేమో. కాకపోతే నా మొదటి రచన కాబట్టి, ప్రస్తుతానికి తప్పులుంటే మన్నించెయ్యండి.

word verification ని తీసేసాను.

భావకుడన్ said:

contd

మీరు అన్నారు "మానసిక సంఘర్షణ" వ్యక్తీ మార్పుకు నాంది అని. ముమ్మాటికీ నిజమే కాని ఆ సంఘర్షణ దేనికి వస్తుంది? వ్యక్తి తన మనసు/సమాజము చెప్పే దాన్నిగురించి atleast పట్టించుకుంటే అప్పుడు వస్తుంది. చాలా మంది మనసు చెప్పినవి వినక అలాగే తమకు నచ్చినది చేసేస్తుంటారు అని నా నమ్మకం. అందుకని వ్యక్తిత్వం మీద depend అయి ఉంటుంది సంఘర్షణను మనిషి పట్టించుకుంటాడా లేదా అనే విషయం.

అయినా ఇవన్ని semantics అండి. నేను అనవసరంగా వాదన (చర్చ కాకుండా) చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. probably its like discussing which came first chciken or egg.

thanks a lot for removing word verification.

ఇకపోతే ఇది మీ మొదటి కథ అన్నది నాకు మీరు చెప్పే దాకా గుర్తు రాలేదు సుమా. చాలా బావుంది మీ మొదటి ప్రయత్నం. భేష్.

ప్రతాప్ said:

అయ్యో నేను చెప్పేది అలా పట్టించుకొని మారే వాళ్ల గురించేనండి. కధ లో ఇలానే నేను, అభి మారాము కదా? :)
నా మొదటి ప్రయత్నంలోనే మీలాంటి వాళ్ళను మెప్పించానంటే నాకు.. నాకు.. నిజంగా ఎనుగునెక్కినంత సంతోషంగా ఉందండి.

Unknown said:

HI,
Asalu kummeru ante. great&good.

ప్రతాప్ said:

థాంక్స్ బుజ్జి గారు..