జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నీకిది తెలుసా?

  • ప్రచురించిన సమయం: 8:45:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నిరాశలో ఎన్ని వేడి నిట్టూర్పులు విడిచానో..
నా ఈ గది నాలుగు గోడలకే తెలుసు..
నీధ్యాసలో ఎన్ని రుధిరాశ్రువులు రాల్చానో..
నా ఈ తలపులు పంచుకొనే తలగడకే తెలుసు..

నీశ్వాసలో మునిగి ఎన్ని పరివేదనలు దాచుకున్నానో..
నా ఈ స్మృతి యవనికలకే తెలుసు..
నీఆశలో తేలి ఎన్ని విరహవేదనలు మిగుల్చుకున్నానో..
నా ఈ గతి పవనికలకే తెలుసు..

నీకోసం విరించినై ఎన్ని ప్రేమలేఖలు రాసానో..
వలపులు నింపుకొనే నా అక్షరాలకే తెలుసు..
నీకోసం విపంచినై ఎన్ని రాగాలు పలికించానో..
తలపులు వొంపుకొనే నా మది గవాక్షాలకే తెలుసు..

ఇవన్నీ నీకై నే రాసే వలపు కావ్యాలు..
ఇవన్నీ నీకై నే దాచే తలపు దృశ్యాలు..

- Inspired by anonymous......

9 people have left comments

తెలుగు'వాడి'ని said:

ఒక అత్యధ్భుతమైన కవిత. హృద్యంగా, మనసుకు హత్తుకునేలా, మరలా మరలా చదవాలనిపించేలా, చక్కని రైమింగ్ తో ఉంది. చదివిన ప్రతి సారి/ఒక్కరు ఎక్కడో ఒకచోట వారిని/వారి జ్ఞాపకాలను చూసుకునేలా చేయటం ఒక కవితకు అమరత్వం ఆపాదించటమైతే ఈ కవిత నిజంగా అజరామరం. అందుకు మీకు వేనవేల అభినందనలు. ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదములు.

Bolloju Baba said:

ఇది వరలో లాగే, దీన్ని కూడానేను ఒక భక్తునికి, భగవంతునికీ, మధ్య సంభాషణ గానే భావించుకుంటున్నాను.

మీ కభ్యంతరం లేదుగా?
సాహితీ యానం

రాధిక said:

అధ్భుతమైన కవిత.

Kathi Mahesh Kumar said:

అద్భుతమైన కవితే...కానీ!

ప్రతాప్ said:

తెలుగు వాడిని గారు: (క్షమించండి మీ పేరేమిటో తెలియదు కాబట్టి అలా సంభోదించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మీ పేరు కోసం మీ బ్లాగు లో తెగ వెతికాను :-| కానీ దొరకలేదు). కవితకు అమరత్వం నిజంగా అవతలి వారి స్పందనను బట్టే వస్తుంది. మీ స్పందన చాలు నా కవితకి. నిజంగా ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను. మీ అభిప్రాయంతో నేను ఏకీభావిస్తున్నాను.

బాబా గారు: నిజం చెప్పాలంటే, కవితలు దాదాపు నేను 12 సం" నుండి రాస్తున్నాను. ఇన్ని రోజులు నా ఆత్మానందం కోసమే రాసేవాడిని. వాటిని కొంతమంది ప్రాణస్నేహితులకు తప్ప ఇంకెవ్వరికీ చూపించేవాడిని కూడా కాదు. కానీ నా స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో బ్లాగు మొదలుపెట్టాను. కానీ బ్లాగులో టపాలు రాస్తున్నానంటే మాత్రం ఆ క్రెడిట్ అంటా మీలాంటి చదువరులకు, చదివి వారి వారి అమూల్యమైన అభిప్రాయములు తెలియచేసే వారికి మాత్రం చెందుతుంది. ఇది మనస్సులోనిమాట మనలో మన మాట.

కాకపోతే ఈ కవిత నేను స్వయంగా అనుభవించి రాసినది. కవిత రాయడం నా వంతు, చదివి అన్వయించుకోవడం మీ వంతు. ఈ కవితని మా తమ్ముడికి చూపిస్తే వాడేమో loveletter కి పనికి వస్తుంది అని అన్నాడు. కాబట్టి అది చదివే వారి విజ్ఞతని బట్టి ఆధారపడి ఉంటుంది కావున నాకేమి అభ్యంతరం లేదు.

రాధిక గారు: మీ స్పందనకు ధన్యవాదములు.

మహేష్ గారు: మీ సందేహం ఏమిటో సెలవివ్వండి.

శిశిర said:

ప్రతాప్ గారూ.... అద్భుతమండీ. మీరు స్వయంగా అనుభవించి రాసారు కనుకే తెలుగువాడిని గారు చెప్పినట్టు మీ కవితకి అమరత్వం వచ్చింది. చాలమంది మీ కవిత లోని భావాలని వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి వుంటారు. కాని ఆ భావాలని ఇంత అందంగా ఆవిష్కరించగలగడం మీకే చెల్లింది.

ప్రతాప్ said:

లాస్యగారికి,
మీ స్పందనకు అభివాదములు. ఆ కవితని కాస్త బాగా గమనించండి. మొదటి రెండు stanza లు నిరాశావాదాన్ని చూపిస్తుంటే, చివరది మాత్రం ఆశావాదాన్ని, ప్రేమోత్తమ గుణాన్ని చూపిస్తూ ఉంది. కవితలో అంత స్పృష్టమైన తేడా ఉన్నప్పటికీ మీ అందరి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉంది.

మీకు ఒక చిన్న సూచన (దయ చేసి అన్యధా భావించకండి).
మీ user profile ని share చెయ్యండి. అలానే మీ blog ఏమిటో తెలుపగలరు.

MURALI said:

అత్యధ్భుతమైన కవిత