జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

మనవి..

  • ప్రచురించిన సమయం: 3:28:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


కనుకొనల చివర నిలిచిన అశ్రుబిందువునడుగు..
నీకై నే రాల్చిన రుధిరాశ్రువులెన్నో చెబుతుంది.
కంటిపాపలలో నిలిచిన చిత్తరువునడుగు..
నీకై నే గీసిన వర్ణచిత్రాలెన్నో చెబుతుంది..
పెదవి చివర నిలిచిన మాటరాని మౌనాన్నడుగు..
నీకై నే దాచిన అరుణ పదనిసలెన్నో చెబుతుంది..
స్మృతి పరదాల చాటున నిలిచిన జ్ఞాపకాలనడుగు..
నీకై నే విరచించిన అభినవ శార్దూలాలెన్నో చెబుతుంది..
విరిసిన తలపులు పంచుకొనే నా తలగడనడుగు..
నీకై నే కన్న స్వప్నాల సంగతులెన్నో చెబుతుంది..
మెరిసిన వలపులు పంచుకొనే నా ఎదనడుగు..
నీకై నే పడ్డ వేదనల రూపులేఖలెన్నో చెబుతుంది..
అశగా ఎదురు చూసే నా మది గవాక్షాలని అడుగు..
నీకై నే ఎదురుచూసిన ఘడియలెన్నో చెబుతుంది..
ఊహల రహదారిపై తడబడుతున్న నా పాదాలనడుగు..
నీకై నే పయనించిన దూరాలెన్నో చెబుతుంది..
సాగర తీరంలో ఆర్తిగా నా పాదాలని స్పృశించే కెరటాలనడుగు..
నీకై నే పడే ఆరాటాల బాసలెన్నో చెబుతుంది..