జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

చూస్తారా?

  • ప్రచురించిన సమయం: 8:28:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


(నేనీమధ్య రోడ్డు మీద వెళుతుంటే, అందరూ రోడ్డులో కొంత గ్యాప్ ఇచ్చి, కొంత పక్కగా వెళ్తున్నారు. ఏమయిందా అని చుస్తే, ఒక ముసలి ఆవిడ, పాపం రోడ్డు దాటలేక, నది రోడ్డు మీదే పాక్కుంటూ, రోడ్డు అవతలి వైపుకి వెళ్తూ ఉంది. అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆవిడ ఎంత అపాయంలో ఉందో పట్టించుకోవడంలేదు. నానాటికీ మనుష్యులలో మృగ్యం అయిపోతున్న మానవత్వానికి ఆనాటి సంఘటన నాకొక సాక్షంగా కనిపించింది, అనిపించింది. ఆ సంఘటనే నన్ను ఈ కవిత రాయడానికి ప్రేరేపించింది.)

ఇదిగో చూసారా ఈమెని?
ఎండిన గాజు కనుల్లోని దైనత్యం మీకు కనిపిస్తోందా?
మనస్సులోని మూగ రోదన మీకు వినిపిస్తోందా?
ఇదిగో చూస్తారా ఈమె,
శుష్కించిన శరీరంపై ఆగిన గురుతులు మీకు కనిపిస్తున్నవా?
జీవం చావని ఎదలో దాగిన ఆశాచారికలు మీకు అగుపిస్తున్నవా?
ఇదిగో చూసారా ఈమెని?
ఎముకులగూడైన కాయంపై కరిగిన జీవితపు అవశేషాలు..
ఇంకా కడుపుతీపిపై మిగిలిన ప్రేమ తాలూకు సశేషాలు..
ఇదిగో చూస్తారా ఈమె జీవితచిత్రాన్ని?
వేలుపట్టుకొని నడక నేర్పించిన మాతృమూర్తి ఈనాడు నడవలేక,
కదిలే జనసముద్రాన్ని దాటలేక, దాటించే దయామయహస్తం కోసం ఎదురుచూస్తూఉంది.
ప్రేమనంతా కూరి నోటిముద్దగా అందించిన అమృతమూర్తి ఈనాడు ఆకలికేక
తో, పిడికెడు అన్నంకోసం అడుక్కోలేక, ఆకలితీర్చే ఆపన్నహస్తం కోసం ఎదురుచుస్తూఉంది.

7 people have left comments

MURALI said:

దేవుడికి అమ్మ లేదు కదా అందుకేనేమో అమ్మ విలువ తెలియదు.

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ said:

గుండెను కదిల్చారు...

చిలమకూరు విజయమోహన్ said:

మనిషిలో మృగ్యమైపోతున్న మానవత్వ విలువలగురించి బాగా తెలియ చేసారు.

saisahithi said:

అమానవీయ సమాజానికి అద్దం మీ కవిత.
ఎవరికి ఏమీ కనబడవు,ఏమీ వినబడవు ఈ సమాజం లో.. చాలా బాగుంది .

కల said:

కొన్నింటిని అందరూ పట్టించుకోరు, పట్టించుకోలేరు కూడా! అటువంటి సందర్భాల్లో మనమే ఒక అడుగు ముందుకేసి మన ఆలోచనలని పట్టించుకోవాలి, ప్రయత్నాలని ముందుకు తీసుకెల్లాలి. నిన్న పేపరులో చదివా oldage helpline number అంటూ ఒక number 040-23390000 ఇచ్చారు. మీకు ఎవరన్న అనాధలైన ముడుసలులు ఎవరన్నా కనిపిస్తే ఈ number కు కాల్ చేసి చెప్పండి.

అయినా ఇటువంటి సందర్భాల్లో మనం కొద్దిగానైనా బాధ్యత తీసుకొంటే సరిపోతుంది. చాలా మంది తృణమో, పణమో ఇచ్చేసి చేతులు దులిపేసుకొంటారు. మరుసటి రోజు వారి సంగతి ఏమిటన్నది ఎవ్వరు ఆలోచించరు. వారిని ఏదన్నా స్వచ్చంద సంస్థ చేతికి అప్పగిస్తే మనం సమాజానికి కాకపోయినా కొద్దిగా వారికన్నా సహాయం చేసిన వారిమవుతాం. దయచేసి అందరూ ఆలోచించండి.

బొల్లోజు బాబా said:

పదాల ఎంపిక విషయంలో ఇదివరలో ఓ కవితతో నేను ఏవిషయంలోనైతే విభేదించేనో, ఆ విషయంలో ఈ కవిత పరిపుష్టంగా ఉందని భావిస్తున్నాను.

ఒక దయార్ధ్రకరుణా దృశ్యాన్ని ఆవిష్కరించటానికి మీరు వాడిన పదాలు -- గాజు కళ్లు, శుష్కించిన, ఆశాచారికలు, ఎముకలగూడు, వంటి శక్తిమంతమైన పదాలు వల్ల కవితకు ఒక బరువు, తడి ఏర్పడింది.
i hope you caught my point by now. (for the previous poem also).

మంచి భావప్రకటన. కవిత ఆద్యంతం ఆర్ధ్రంగా కదిలించేదిగా ఉంది.

నా కవితపై మీ విశ్లేషణ చాలా బాగుంది. శ్రమతీసుకొన్నందుకు ధన్యవాదములు. త్వరలో సమాధానమిస్తాను.

కల గారూ
మంచి స్పందన. ఎందుకో తెలీదు నేనుమీకు అభిమానినైపోతున్నానండోయ్.
అభినందనలు.

బొల్లోజు బాబా

రాధిక said:

గు0డె బరువెక్కి0ద0డి.