జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

ఒక వర్షాకాలపు సాయంత్రం..

  • ప్రచురించిన సమయం: 2:46:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కథలు

అప్పుడే వర్షం కురవడం మొదలయింది. సన్నటి జల్లులు హాయిగా, ఆర్తిగా నను తడిమేస్తూ, తడిపేస్తూ ఉంటే ఇలా బైక్ నడపడం ఎంతో హాయిగా ఉంది. ఇంక నా వెనుక "తను" కూర్చొని ఉంటే ఈ రైడ్ ఇంకా ఎంత బావుండు అని ఒక్క క్షణం అనిపించింది. కానీ అది ఒక్క క్షణమే, సరేలే ఇంకో పది నిముషాల్లో ఎలాను ఇంటికి చేరిపోతాం కదా, వెంటనే తనని తీసుకోని అలా కార్లో, ఏకాంతంగా(?) ఉన్న రోడ్ల వెంబడి పరుగులు తీయించాలి అనుకొన్నా. ఈ ఉహ మదిలో మెరిసిన మరుక్షణం నా బైకు వేగం నాకు తెలియకుండానే పెరిగింది. అనుకోన్నట్లే పది నిముషాల్లో ఇంటి ముందుర వున్నా. కాలింగ్ బెల్ కొట్టబోతూ ఉండగా నెమ్మదిగా "ఆకులో ఆకునై, పువ్వు లో పువ్వునై" అన్న కృష్ణశాస్త్రి గారి లలిత లాలిత్యపు గీతం మధురంగా నా చెవులకు సోకింది. ఒక్క క్షణం అర్ధం కాక, మరోక్షణం అంత శ్రావ్యమైన పాటని పూర్తిగా వినాలన్న కోరికతో, ఇంకోక్షణం ఆ పాటకి అంతరాయం కలిగించలేక అలా నిలుచుండి పోయాను. ఏమయిందో ఏమో ఆ గాత్రం వెంటనే ఆగిపోయింది. నెమ్మదిగా కాలింగ్ బెల్ కొట్టాను. అత్యంత మృదువైన పాదాల సవ్వడి తలుపును సమీపిస్తున్న శబ్దం నను చేరింది. క్లిక్ మన్న శబ్దంతో తలుపు తెరుచుకొంది. ఎదురుగా "తను", ఎంత పని చేసినా ఎప్పుడు అలసిపోని చిరునగవు మొహంతో నా "తను".

"వచ్చేసారా? ఎంతసేపయింది వచ్చి?" అంటూ నేను లోపలకి నడిచేదానికి దారి వదలింది.

"10 నిముషాలు అయింది వచ్చి". అంటూ నేను లోపలికి నడిచాను.

"మరి అంత సేపు తలుపు కొట్టకుండా ఎం చేస్తున్నారు?" అని అడిగింది.

"నువ్వు పాడుతున్న పాటని అలా వింటూ బయటే నిలుచుండి పోయాను. నువ్వు అలా పాడుతూ ఉంటే నాకేమో సమయం తెలియదు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా బాగా పాడుతావ్ సుమీ." అన్న నా సమాధానికి తన మొహంలో కూసింత ఆనందం, కూసింత గర్వం, కూసింత సిగ్గు క్షణకాలం మెరిసి మాయమయి పోయాయి. నిజం చెప్పొద్దూ ఆ క్షణంలో నా "తను" మోములోని భావాలని ఒడిసి పట్టుకోవాడానికి నేను రవివర్మ నైతే ఎంత బావుండు అనిపించింది.

"ఫో నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్." అంటూ వంటగదిలోకి తుర్రుమంది. తనవేనుకాలే "అది కాదు నే చెప్పేది నిజం. నువ్వు నమ్మాలంటే ఏం చెయ్యాలో చెప్పు." అంటూ అనుసరించాను.

"ఏం చెయ్యనక్కరలేదు కానీ, ముందర తమరు ఫ్రెష్ అయిరండి." అంటూ నన్ను బాత్రుం లోకి బలవంతగా నెట్టింది.

నేను 5 నిముషాల్లో ఫ్రెష్ అయి అలా బాల్కనీలో కూర్చొని కురిసే వర్షాన్ని చూస్తూ ఉండిపోయాను. తనతో బయటకి వెళ్ళాలని ఉన్నా, ఇప్పుడు బలవంతంగా బయలుదేరతీయడం మంచిది కాదు అని ఆగిపోయాను. ఈ వానలో కాఫీ తాగాలనిపించి, "ఒక కప్పు కాఫీ" అని పెద్దగా అరిచాను. అంతే చేతిలో ఘుమఘుమలాడే కాఫీ కప్పులతో నా ఎదురుగా "తను". నాకొక కప్పు ఇచ్చి తనొక కప్పు తీసుకోని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని నాతొ పాటు వర్షాన్ని అనుభవించడం ప్రారంభించింది. మేము అలా ప్రకృతిని అనుభవిస్తూ, కాఫీని ఆస్వాదిస్తూ, మధ్యలో మాటల చెణుకులు విసురుకొంటూ అలానే ఉండిపోయాము.

కాస్సేపటికి "ఏమిటి? అలా నిశ్శబ్దంగా ఉన్నావు?" అన్న ప్రశ్న వినిపించి తల పైకెత్తాను. నా వైపు కుతూహలంగా చూస్తూ నా "తను".

"నిశ్శబ్దంగా కాదు, మౌనంగా ఉన్నాను."

"రెండూ ఒకటే కదా?" చిన్నపిల్లల్లా అడిగే తన మోము చూస్తే నిజం చెప్పొద్దూ నాకు చాలా ముద్దొచ్చింది, అలానే తన ప్రశ్నకు నాకు నవ్వొచ్చింది.

"నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు." అన్న తన మాటలకు లోకంలోకి వచ్చి పడ్డాను.

"మాటలు లేకపోవడం నిశ్శబ్దం, మాటలు రాకపోవడం మౌనం." అని జవాబిచ్చాను.

ఆ జవాబుకి తను మోము కాస్త చిన్నబోవడం గమనించి టాపిక్ ని మార్చే దానికి, "ఇవ్వాళ వంటేం చేస్తున్నావ్?" అని అడిగాను.

"చెప్పు ఏం చెయ్యమంటావో?" అని అడిగింది.

"రేపు నాకు ఎలాను శెలవు కాబట్టి, ఈ రోజు వంట నేను చేస్తాను, నువ్వు తిను చాలు." అని చెప్పాను.

"ఆ నువ్వు చేస్తే ఇక తిన్నట్టే మరి. మొన్నొక రోజు వంటతో నీ తంటా చూసాను. నీకు అంత శ్రమ అక్కరలేదు కానీ, ఏం కావాలో చెప్పు చాలు, నేను చేసి పెడుతాను."

నేను వదులుతానా? ఎలాగోలా ఒప్పించి నా "తను" ని పక్కన కూర్చోబెట్టి ఉల్లిపాయలు కోయడం మొదలెట్టాను. అంతే, వరద గేట్లు తెగినట్లు కళ్ళలోంచి ఆగకుండా నీళ్ళు బయటకి రావడం మొదలెట్టాయి. ఇక మన వల్ల కాదు అని గమనించిందో ఏమో "తను" వచ్చి నిశ్శబ్దంగా నా చేతిలోని కట్టర్ ని అందుకొని వాటిని కోయడం మొదలెట్టింది, నేను హెల్ప్ చెయ్యడం మొదలు పెట్టాను. అలా వంట చేసుకొని బయటకి వచ్చేసరికి, వాన పూర్తిగా తగ్గి, మేఘాల చాటునుంచి చంద్రుడు మా ఇద్దరినీ చూడటం మొదలెట్టాడు.

మాటలకన్న మధురమైన భాష మౌనమే అని ఈ సందర్భంలో మరోసారి రుజువయ్యింది. మా మధ్యన మాటలులేకుండా కేవలం మౌనంతో సంభాషించుకొంటూ, అప్పుడప్పుడు చూపుల శరంపరలని సంధించుకొంటూ ప్రకృతిలో మమేకమై, మాలో మేము అంతర్భాగమై ఆ సందర్భాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాం.

ఇంతలో "నాకోసం ఒక పాట పాడవా?" అని నా "తను" నను మెల్లగా ఒక కోరిక కోరింది.

"నేనా? పాటా?" అంటూ ఆశ్చర్యపోయాను.

"అదేమిటి? మరీ సంతూర్ మమ్మీ లా అంత ఆశ్చర్యపోతావ్? ఆ నువ్వే, ఒక పాట పాడు మరి నాకోసం." అంటూ బలవంత పెట్టింది.

"సరే పాడితే నాకేం ఇస్తావ్?" అన్న ప్రశ్న నా నుంచి.

"నీకేం కావాలంటే అది కాదు. నువ్వు ఊహించలేనిది నీకు దొరుకుతుంది" అంది పెదాలని గుండ్రంగా చుట్టి గాలిలోకి ముద్దులు విసురుతూ.

"భలే మంచి బేరము, పసందైన బేరము" అని నా మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేస్తుండగా ఏం పాట పాడాలా అని ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ ఎంత ఆలోచించినా నాకు పాట తట్టలేదు. ఇదే చెప్పి "నీకేం పాట కావాలో చెప్పు అదే పాడుతాను" అని చెప్పాను.

"నీకు నాకు ఇష్టమైన పాట పాడు" అన్న సమాధానం.

"నీ నవ్వు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో.." అంటూ పాడ సాగాను.

పాట మొత్తం పూర్తయ్యేంతవరకు మా మధ్యలోకి గాలి సైతం చొరబడడానికి సందేహించింది. పాట పూర్తికాగానే వర్షం, ఆకాశంలోంచి కాదు, నా "తను" కనులలోనుంచి. తనని పూర్తిగా ఏడవనిచ్చాను, ఎన్నాళ్ళనుంచో తన గుండెల్లో గూడు కట్టుకొన్న బాధ కరిగి, చెలియకట్ట దాటి హాయిగా ఈ లోకంలోకి ప్రవేశించి నెమ్మదిగా అదృశ్యమవుతుందన్న ఆలోచనతో తనని ఇంకా ఏడవనిచ్చాను.

కాస్సేపటికి తను తెప్పరిల్లింది. సరే సందర్భాన్ని మారుద్దామని, "పాట పాడేసాను కదా. మరి నా గిఫ్టు సంగతి ఏమిటి?" అని అడిగాను. ఊహించలేని గిఫ్టు ఏమయింటుందో అని ఊహించేదానికి ప్రయత్నిస్తూ.

అంతే కళ్ళ ముందర నక్షత్రాలు కనిపించాయి, చెవులకి ఉరుముల మెరుపుల శబ్ధాలు వినిపించాయి తను నా చెంపమీద కొట్టిన దెబ్బకి. "అమ్మనీ ఉహించని గిఫ్టు అంటే ఇదా? దెబ్బ కొట్టావు కదే? ఉండు నీ పని చెబుతా" అని తనని పట్టుకొనే దానికి ప్రయత్నించాను. మెరుపులా మెరిసి చటుక్కున మాయమయ్యి, గాలిలా అక్కడ ఇక్కడ ఉంటూ, నీళ్ళలా చేతిలోంచి జారిపోతూ, "నన్ను పట్టుకోలేవు నీ వల్ల కాదు" అని ఏడిపిస్తూ ఇల్లంతా పరిగెడుతున్న తనని పట్టుకోవడం నిజంగానే నా వల్లకాలేదు. ఈ ప్రయత్నంలో నా కాలు మెలికబడింది,
'అమ్మా' అంటూ కూలబడిపోయాను. "ఏమయింది?" అంటు ఆందోళనతో నన్ను చేరిన నా "తను"ని "పట్టుకోలేనన్నావుగా చూడు
పట్టేసుకున్నా" అని తనని గట్టిగా పట్టుకొన్నాను. "ఇలా అబద్దం చెప్పి పట్టుకోకూడదు మొద్దబ్బాయ్" అని నన్ను వదిలించుకోవాలని తను ప్రయత్నిస్తుండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

"ఎవరో వచ్చారు వెళ్ళి తలుపు తియ్యి" అని అన్నాను.

"నువ్వొదిలితే అలానే వెళ్ళి తీస్తాను. వదులు మరి."

"సరే వెళ్ళి తియి" అని నా పట్టుని తప్పించాను.

"ఎవరూ?" అని తను వెళ్లి తలుపు తీసింది. పక్కింటి సుందరంగారు, వాళ్ళావిడ పక్కనే ఇంకెవరో చిన్న పిల్లాడు వాకిట్లో నిలబడి ఉన్నారు. "రండి" అని వాళ్ళని లోపలికి సైగల ద్వారా ఆహ్వానించాము. వాళ్ళు వచ్చి "రేపు సత్యన్నారాయణ స్వామి వారి వ్రతం మీరిద్దరూ తప్పకుండా రావాలి" అని అతికష్టం మీద మాకు అర్ధమయ్యేలా వారికొచ్చిన సైగల భాష ద్వారా చెప్పారు. అంతలో పక్కన ఉండే అబ్బాయి, "ఏమయింది మామయ్య? ఎందుకు నువ్వు సైగలు చేస్తున్నావు? వీళ్ళిద్దరికి ఏమయింది?" అని మా ఇద్దరిని చూపించి ప్రశ్నించాడు. దానికి సుందరంగారు, "వీళ్ళిద్దరికి వినపడదు, మాటలు రావు. అందుకని" అని చెప్పారు. లిప్ మూవ్మెంట్ ద్వారా వాళ్ళేం మాట్లాడుకొంటున్నారో అర్ధం చేసుకోవడం మా ఇద్దరికీ పెద్ద కష్టం కాలేదు. కానీ ఆ పిల్లాడు చూసిన చూపుకి మాత్రం చాలా బాధవేసింది, ఆ చూపు నిండా జాలి ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటైన జాలి, నీకేమి చేతకాదు వెళ్ళి ఆ మూల కూర్చో అని వెక్కిరించే జాలి. వీళ్ళకెందుకు చదువు సట్టుబండలు అని వెక్కిరించే జాలి. మీక్కూడా అలానే అనిపిస్తోందా?

==========================================================================
మొన్న వినాయక చవితి సందర్భంగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ట్రైన్ లో నా కెదురుగా ఉన్న బెర్తుల మీద మంచి జంట, చూడ కన్నుల పండుగగా ఉన్నారు. నాకు చాలా సేపటివరకు అర్ధం కాలేదు ఇద్దరికీ మాటలు రావని. అర్ధమయ్యాక ఒక్కక్షణం ఎవరిమిదో చెప్పలేనంత కోపం, చూపించలేనంత ఉక్రోషం. వాళ్లతో మాటలు కలిసాక అర్ధమయింది, వాళ్ళకి కావలసింది జాలి కాదు కొద్దిగా మానవత్వం కలిసిన సాయం అని. ఈ కధకి వారే ప్రేరణ, అలానే అవసరమైన థీమ్ వచ్చేలా తమ కధ ద్వారా నన్ను inspire చేసిన ప్రసాదం గారికి కూడా కృతజ్ఞతలు.
==========================================================================

33 people have left comments

Bolloju Baba said:

మీరు వచనం కూడా బాగా వ్రాస్తున్నారు.
బొల్లోజు బాబా

Anonymous

Anonymous said:

chaalaa baagundi andi
last naa nennassalu oohinchale alaa vuntundi ani
anta daakaa evevo oohalato oohala lokam lo vihalinchina nenu last vaakyam choosi
elchinanta pani chechaaa
chaalaa baagundi

ramya said:

రాయటానికి మాటల కోసం వెతుక్కుంటూ ఉన్నా..

కల said:

చివరి వరకు ఆగకుండా చదివాను, కాని క్లైమాక్స్ చదివిన తర్వాత చాలా బాధవేసింది. అస్సలు ఉహించలేదు అటువంటి ముగింపునిస్తావని.

బ్లాగు రూపురేఖలు ఇప్పుడు బావున్నాయి.

నిషిగంధ said:

కధ చదువుతూ ఉంటే ఇది కూడా మామూలు ప్రేమ/అన్యోన్య కధ అవుతుందేమో అనిపించింది.. కానీ ఎండింగ్ మాత్రం అమోఘం!! Very touching and inspirational!!

మీ బ్లాగ్ కొత్తరూపం చాలా బావుంది ఒక్క టాం క్రూయిస్ బొమ్మ తప్ప :-))

సుజాత వేల్పూరి said:

చివర్లో చిన్న ట్విస్టేదో ఉంటుందనుకున్నాను గానీ ఇలా అనుకోలేదు. చదివి అలా కూచున్నానంతే! ఇలాంటి వాళ్ళు అడపా దడపా బస్సుల్లోనూ ట్రైన్లల్లోనూ కనపడుతుంటారు. చూసినపుడు అయ్యో అనుకోడమే కాక ఇంత చక్కగా మనసుని కదిలించేలా పంచుకోవాలని అనిపించడం మీ గొప్ప తనం! బావుంది.

మీ టెంప్లేట్ బాగుంది, కొంచెం ఆకుపచ్చదనం ఎక్కువైనట్టుంది.

Rajendra Devarapalli said:

మనోజ్ దాస్ రాసిన కధొకటి చదివి,సల్మాన్ ఖాన్,మనీషా నటీంచిన ఖామోష్ సినిమా కూడా ఒక్కసారి చూసి ఈ కధను కాస్త విరామం తర్వాత(అంటే మూగ చెవిటి వారి మీద) మరలా రాయగలరు

ప్రతాప్ said:

బాబా గారికి కృతజ్ఞతలు.

ప్రతాప్ said:

లచ్చిమి గారికి కూడా, మీరన్న దాన్ని పొగడ్తలానే తీసుకుంటాను.

ప్రతాప్ said:

కల, రమ్య గార్లకి కృతజ్ఞతలు.

ప్రతాప్ said:

నిషి గంధ గారికి, మీలాంటి చెయ్యి తిరిగిన రచయిత్రుల చేత పొగిడించుకొన్నాను అంటే నేను కూడా గుడ్డే అన్న మాట.
టామ్ క్రూయిస్ నా అభిమాన నటుడు, అందుకని అతన్ని అక్కడ ఉంచాను. కానీ తొందరలోనే మార్చాలి.

ప్రతాప్ said:

సుజాత గారికి, ఇందులో నేను చేసింది ఏముంది చెప్పండి. వాళ్ళని చూస్తే (ఇలా అనకూడదు కానీ) ఏం పాపం చేసారని? చదివి వారి బాధలో(?), ఆనందంలో(?) ఇలా పాలు పంచుకొన్న మీలాంటి పాఠకులే నిజంగా గొప్పవాళ్ళు.

ప్రతాప్ said:

రాజేంద్రగారు,
మనం హిందీలో బ్బే బ్బే. నాకు హిందీ అస్సలు రాదు. నేనిప్పటికీ ఒక రెండో మూడో హిందీ సినిమాలు చూసి ఉంటాను. నా చివరి హిందీ సినిమా రంగ్ దే బసంతి (ఫ్రెండ్స్ బలవంతం మీద వెళ్ళాను). ఏదో నాకు అనిపించిన ఫీలింగ్ ని అలా కధ రూపంలో బయట పెట్టాను అంతే. కాకపోతే నాకొక సందేహం మీరు నన్ను తిట్టారా? పొగిడారా? అనేది అర్ధం కాకుండా ఉంది.
మీకు అభ్యంతకరం లేకపోతే ఈ మనోజ్ దాస్ గురించి తెలుసుకోవాలని ఉంది.

Rajendra Devarapalli said:

ప్రతాప్ గారు,అయితే అంత అసహ్యంగా,అర్ధం కానట్టు రాస్తున్నానన్న మాట ఇక ముందు నేను ఈ పద్ధతి మార్చుకుని అందరికీ అంతుపట్టేలా రాయాలి :)
మనోజ్ దాస్ ఒకప్రఖ్యాత భారతీయ రచయిత,ఒరిస్సాలో పుట్టి ప్రస్తుతం పాండిచ్చేరిలో స్థిరపడ్డారు.ఆయన రాసిన ఒక కధలో...ఒక పర్యాటకస్థలములో మన రచయితకు ఎదురైన ఒక చిన్న ముద్దులొలికే పాప,ఈయన ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉలకదు,పలకదు,చివరకు మరొక యువకుడితో చెంగున గంతులు వేస్తూ ఉంటుంది.ఏమిటయ్యా కారణం అంటే ఇద్దరూ మూగ,చెవిటి వారని ముగిస్తారు.కానీ ఆకధ పేరు ప్రస్తుతం నాకు గుర్తులేదు.
మనోజ్ దాస్ గురించి ఈ లంకెల ద్వారా క్లుప్తంగా తెలుసుకోవచ్చు...
http://www.loc.gov/acq/ovop/delhi/salrp/manojdas.html

http://en.wikipedia.org/wiki/Manoj_Das


అలాగే ఖామోషీ సినిమాలో నానాపటేకర్,సీమా బిశ్వాస్ చెవిటి మూగ పాత్రలు పోషించారు.ఆ వివరాలు ఇక్కడ..

http://en.wikipedia.org/wiki/Khamoshi:_The_Musical

రాధిక said:

no words.plz give me some time .

Mitra said:

"మధురమైన భాష మౌనమే!". Excellent. Well written. Life is full of surprises.

Kathi Mahesh Kumar said:

చాలా మంచి ప్రయత్నం.ముగింపు హృద్యంగా ఉంది.అభినందనలు.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said:

చాలా బాగా రాసారు. అక్షరాల్లో వాళ్ళ మౌనానికి మాటలు కట్టారు.

ప్రసాదం గారు మంచి టపా రాసేలా స్పూర్తినందించిన టపా రాసిన మీకు కూడా నా అబినందనలు.

ప్రతాప్ said:

రాధిక గారికి, మీ మాటలే చెబుతున్నాయి మీరెంత ఫీల్ అయ్యారో అని.

ప్రతాప్ said:

శ్రీని గారికి, అలానే మహేష్ గారికి
కృతజ్ఞతలు.

ప్రతాప్ said:

బ్రహ్మి గారికి, కృతజ్ఞతలు.
ప్రసాదం గారు రాసిన టపా చాలా వరకు బాగా నవ్వు తెప్పిస్తుంది.
కానీ నా టపా మటుకు కొద్దిగా బాధను మిగులుస్తుంది.

కల said:

నాకెందుకో మళ్లీ మళ్లీ చదవాలనిపించిన కథ ఇది, చదివి మళ్లీ కామ్ గా ఊరుకోలేక ఈ వాఖ్య రాస్తున్నా.
మాములుగా మొదలయ్యి, మధ్యలో ఏదో చిన్న చిన్న సరదాలను చూపిస్తూ చివరకి వచ్చే సరికి ఏమయిందో అర్ధం కాక, ఏమయిందో అర్ధం చేసుకొనే సరికి మనస్సులో ఒక దగ్ధవీచికని ప్రవేశపెట్టి నిశ్శబ్దంగా తనదారిన తానూ వెళ్ళిపోయే బాటసారి ఈ కథ ఇది. రచయిత పరిణితి అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పలేను కానీ, తన రచనలో తమని తాము చూసుకొనే పాత్రని చిత్రీకరించగల రచయిత/త్రి గొప్పవారు, అలాంటి పాత్ర చిత్రీకరణ ఈ కథలో లేక పోయినా చదివిన తర్వాత ఒక బలమైన ఫీలింగ్ ని మనకు అందిచే కథ ఇది.
మౌనానికి, నిశ్శబ్దానికి గల తేడా చెప్పడం నీలో పరిశీలనా శక్తిని తెలియచేస్తుంది.
మౌనం కన్నా మధురమయిన భాషలేదు I agree with you.

ప్రతాప్ said:

Thankyou కలా,
నువ్వెంతగా ఈ కథ చదివి కదిలిపోయావో నీ మాటలే చెబుతున్నాయి. ప్రతిసారీ రచనలో మనలని ఐడెంటిఫై చేసుకోగల పాత్రని సృష్టించడం రచయిత వల్ల కాదు కానీ, చుట్టూ వున్న సమాజంలోని ఏదో ఒక పాత్రని చూపించగల సామర్ధ్యం రచయితలో ఉంటే చాలు, ఆ రచయిత కథకునిగా సఫలమైనట్లే. నేను మాత్రం ఆ స్థాయిని చేరుకోలేదు, బహుశా చేరుకోలేనేమో కూడా.

మరలా ఇంకోసారి కృతజ్ఞతలు.

Purnima said:

బాగుంది చాలా! ఎక్కడికో తీసుకుపోయారు. మా చుట్టాల్లో ఒకరు ఇలానే.. ఇద్దరికీ మాటలుండవు, కానీ వాళ్ళ సంభాషణ చూసి తీరాల్సిందే! ఎన్నో అలలను రేపారు.

కథనం ఇంకా బాగా చేయవచ్చు ఏమో! అంటే.. నిజంగా ఇద్దరు మూగ వాళ్ళు మాట్లాడుకునేది, గొంతుతో తప్పించి అన్నింటితో. అది అక్షరాల్లో దింపగలిగితే తిరుగుండదు. No dialogues at all!

ఖామోషీ సినిమా చూడండి. భాష పెద్దగా అవసరం లేదనుకుంటా. అలానే రస్కిన్ బాండ్ కథలు చదవండీ. అందులో ఒక కథలో ఒక visually challenged అబ్బాయి రైల్లో వెళ్తూ తన ముందు సీటులో కూర్చుంది ఒక అందమైన యువతి అని చూసి (కళ్ళతో తప్పించి అన్నింటితో) ఆమెను ఆకర్షించడానికి బోలెడంత శ్రమిస్తాడు, అతడికి చూపులేదని ఆమె గ్రహించకుండా. ఒక స్టేషనులో ఆమె దిగిపోయి, ఇంకెవరో ఎక్కుతారు. కుతూహలంతో, ఆమె జుట్టు గురించి అడుగుతాడు ఈ అబ్బాయి. అప్పుడు అటు నుండి వచ్చే సమాధానం "ఏమో.. ఆమె కళ్ళనే చూస్తూ ఉన్నాను. అంత అందమైన కళ్ళు చూడలేవంటే బాధగా ఉంది" అని. కథను ఇక్కడే రివీల్ చేయడానికి కారణం, మొదలెడితే తప్పక చదివిస్తాడు బాండ్. Must read, if you've not still. (మీరు ఇంగ్లీషు మీడియం ఎస్.ఎస్.సి చదివుంటే, ఇది ఏదో తరగతి ఇంగ్లీషు పాఠ్యాంశం)

Good job!

కొత్త పాళీ said:

good skillful narration.
There's a Sanjeev Kumar Jaya Badhuri starrer in which both of them are deaf and dumb. good film.

Anonymous

Anonymous said:

ఇంకా బాగా రాయండి.

కొత్తపాళీ గారు ఉదహరించిన సినిమా పేరు - కోషిష్. అవకాశం ఉంటే చూడండి.

ప్రతాప్ said:

పూర్ణిమ గారు,
ముందుగా కృతజ్ఞతలు. నిజమే కదా? వాళ్ళు కళ్ళతో, మనస్సులతో మాట్లాడుకొంటూ ఉంటే ఆ కనులు పలికే భావాలని చూడవలసిందే.
కథనం విషయంలో నేను తడబడ్డాను, వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలని ఊహించి రాయడంలో నేను పూర్తిగా సఫలం కాలేకపోయాను. దాని గురించి నన్ను నేను తవ్వుకోవలసిందే. రస్కిన్ బాండ్ వి కొన్ని ఎప్పుడో చదివాను. అంతగా నన్ను కదిలించనవి పెద్దగా లేవనే చెప్పవచ్చు. నా ఇంటర్ ప్రేటేషన్ స్థాయిలో తేడాలున్నాయేమో చూసుకోవాలి. కాని మీరు చెప్పిన కథ చాలా బావుంది, చదివి తీరుతాను.

ప్రతాప్ said:

కొత్తపాళీ గారు,
నాకు ఏనుగునెక్కినంత సంతోషంగా ఉంది, ఎందుకంటే నన్ను మీరు మొదటిసారిగా మెచ్చుకొన్నారు కాబట్టి. మీకు బోలెడు నెనర్లు.

ప్రతాప్ said:

@నెటిజన్ గారు నెనర్లు, ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తాను.

Anonymous

Anonymous said:

అయ్యో ప్రతాప్ గారు నేను మిమ్మల్ని ఏమీ అనలేదు మెచ్చుకున్న్నాను
మీరేమో పొగడ్త లానే తీసుకున్నాను అంటే ఏమిటండీ దాని అర్థం

పాఠకులు ఊహించని ముగింపు ఇవ్వడం లోనే రచయిత గొప్పదనం వుంటుంది
మీరు అది ఇచ్చారు
నేను అన్నది అదే--" నేను అస్సలు ఊహించనే లేదు ముగింపు అని"

చిన్న పిల్లని కదటండీ కాస్త అర్థం చేసుకోవాలి మలి మీలే

ప్రతాప్ said:

మీ మాటలని పొగడ్తలానే అంటే, మీకు ఇంత భావోద్వేగాన్ని కలిగించింది అంటే నేను కథని బాగా రాసాను అనే కదా అర్ధం? అందుకని మీరు మెచ్చుకున్నట్టు అని అనుకొన్నా. అయ్యో మరి అలా అనలేదా?

Anonymous

Anonymous said:

అయ్యో ప్రతాప్ గారు
మీరన్న మాటే చూడండి -" మీ మాటల్ని నేను పొగడ్త లానే తీసుకుంటున్నాను " ఈ వాక్యం నాకు ఎలా అర్థమయ్యింది అంటే నేను మిమ్మల్ని పొగిడానో తిట్టానో తెలియక ఏదో ఒకటి లే అని మీరు దాన్ని పొగడ్త లా తీసుకుంటున్న లే అన్నట్టు వుంది
అందుకే ఏమిటండీ దాని అర్థం అని అడిగా
నే చెప్పొచ్చేదేంటంటే అధ్యక్ష!!! నేను మిమ్మల్నే పోగిడాను అండీ

ప్రతాప్ said:

అయ్యో లచ్చిమి గారు ఎంత పని జరిగిపోయింది.
క్షమించండి, నేనా ఉద్దేశ్యంలో అనలేదు. మీరు నన్ను పొగిడారని ఇప్పుడు confirm అయిపోయాను.

Commentors on this Post -